బయో దాడులు జరిగే అవకాశం?

ఉగ్రవాదులు బయో-టెర్రరిస్ట్ దాడులు చేసేందుకు కోవిడ్-19 మహమ్మారి అవకాశాలను కల్పించిందని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరెస్ మాట్లాడుతూ, వైరస్ జాతులను సొంతం చేసుకునే అవకాశాలు ఉగ్ర మూకలకు లభించే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఇదే జరిగితే ప్రపంచానికి పెనుముప్పు వాటిల్లుతుందని చెప్పారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

కరోనాపై జరుగుతున్న పోరాటాన్ని ఒక తరం చేస్తున్న యుద్దంగా గుటెరెస్ అభివర్ణించారు. కోవిడ్-19 అనేది ప్రథమంగా ఒక ఆరోగ్య సమస్య అయినప్పటికీ… దీని పర్యవసానాలు దానికి మించి ఉంటాయని చెప్పారు. ప్రపంచ శాంతి, భద్రతకు ఇది పెను ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని తెలిపారు. కరోనాపై పోరాటం సామాజిక అశాంతికి, హింసకు దారి తీసే అవకాశం ఉందని చెప్పారు.

ఈ మమమ్మారి వల్ల ప్రపంచ దేశాల బలహీనతలు, సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి సిద్ధమైన తీరులోని లోపాలు బయటపడ్డాయని… ఇది బయో-టెర్రరిస్ట్ దాడులకు ఒక దారిని చూపించే విధంగా ఉందని గుటెరస్ చెప్పారు. వైరస్ లను పొందే అవకాశాలు ఉగ్రమూకలకు లభించవచ్చని… అది ప్రపంచాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేస్తుందని తెలిపారు.

కరోనా నేపథ్యంలో సామాజిక పరిస్థితులు కూడా దారి తప్పుతున్నాయని గుటెరెస్ ఆందోళన వ్యక్తం చేశారు. విద్వేపూరిత వ్యాఖ్యలు పెరుగుతున్నాయని… పరిస్థితిని మరింత దిగజార్చేందుకు తీవ్రవాదులు య్నతిస్తున్నారని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *