వాట్సప్ సేవలకు అంతరాయం-జనం గగ్గోలు

ప్రముఖ సోషల్ మీడియా సాధనం ‘వాట్సప్’ సేవలకు కొద్ది సేపు అంతరాయం కలగడం కలకలం రేపింది. సాధారణ ప్రజల జీవితంగా భాగంగా మారిపోయిన వాట్సప్ సేవలకు దాదాపు రెండు గంటలకు పైగా అంతరాయం ఏర్పడడంతో ఇందులో మునిగితేలే జనాలు తీవ్ర ఆందోళనలకు గురయ్యారు. భారత్ తో సహా పలు దేశాల్లో వాట్సప్ సేవలు కొన్ని గంటల పాటు నిల్చిపోయాయి. నిత్యం కోట్లాది సందేశాలను మోసుకుని పోతున్న వాట్సప్ సర్వర్లు మోరాయించడంతో ఈ సమస్య తలెత్తినట్టుగా తెలుస్తోంది. వాట్సప్ సేవల్లో అంతరాయం ఏర్పడినట్టు సోషల్ మీడియా దిగ్గజం అంగీకరించింది. సాంకేతిక సమస్యల వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని వాట్సప్ పేర్కొంది. అయితే ఈ సమస్య ఎందువల్ల వచ్చిందనేది మాత్రం ఆ సంస్థ వెల్లడించలేదు. ప్రస్తుతం సమస్య పరిష్కారం అయిందని వాట్సప్ సేవలు యాధాతదంగా కొనసాగుతాయంటూ ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు.