సమస్యల పరిష్కారానికి కలెక్టర్ సెల్ఫీ మంత్రం

ప్రతీ చోట… ప్రతీ సారి సెల్ఫీ దిగడం అలవాటుగా మారిపోయింది. ఈ సెల్ఫీ మంత్రాన్ని మంచి పనులకోసం వినియోగిస్తూ అందరి చేతా శభాష్ అనిపించుకుంటున్నారు వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి. తనదైన శైలిలో పనిచేస్తూ అందరి చేతా మన్నలను అందుకుంటున్న ఈ డైనమిక్ అధికారి తాజాగా తీసుకున్న ఒక సెల్ఫీ నిర్ణయం విద్యార్థులకు వరంగా మారింది. జిల్లాలోని అన్ని రకాల హాస్టల్స్ లో కలుపుకుని దాదాపు 4900 మంది విద్యార్థులు ఆశ్రయం పొందుతున్నారు. అయితే ఈ హాస్టళ్లలో సదుపాయాల కొరతో పాటుగా ఇందులో పనిచేసే ఉద్యోగుల అలక్షం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. హాస్టల్ వార్డెన్లతో పాటుగా ఇతర సిబ్బంది విధులకు హాజరు కావడం లేదని భోజనాల సమయంలో వీరు అందుబాటులో ఉండడం లేదని ఆరోపణలు ఉన్నాయి. వీటిని కట్టడి చేసేందుకు కలెక్టర్ ఒక వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చారు. జిల్లాలోని అన్ని హాస్టళ్ల వార్డెన్లు, ఇతర సిబ్బందిని కలుపుకుని ఒక వాట్సప్ గ్రూప్ ను ఏర్పాటు చేశారు. ఈ గ్రూప్ లో ప్రతీ రోజు వార్డెన్లు భోజనాల సమయంలో అక్కడి విద్యార్థులతో కలిసి సెల్ఫీ దిగి ఆ ఫొటోను గ్రూప్ లో పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. దీనితో వార్డెన్ల హాజరు శాతం గణనీయంగా మెరుగైనట్టు తెలుస్తోంది.
హాస్టల్స్ లో ఉన్న సమస్యలను గురించి ఎప్పటికప్పుడు నేరుగా కలెక్టర్ తెలుసుకునే అవకాశం కలగడంతో సమస్యలు వేగవంతంగా పరిష్కారం అవుతున్నాయి. నిర్ణయాలు తీసుకోవడానికి రోజుల తరబడి సమయం పట్టకుండా వెంట వెంటనే సమస్యలను అప్పటికప్పుడు పరిష్కారం లభిస్తుండడం పట్ల విద్యార్థులతో పాటుగా ఉద్యోగులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *