ఓటుకు నోటు కేసుపై సీఎం సమీక్షలో అంతరార్థం?

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఓటుకు నోటు కేసు పురోగతిని గురించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించినట్టుగా వస్తున్న వార్తలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. చాలా కాలంగా ఈ వ్యవహారంపై స్థబ్దుగా ఉన్న సమయంలో మరోసారి ఈ కేసుకు సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి ఆరాతీయడం విశేషం. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తమ అభ్యర్థికి ఓటు వేయాలంటూ నామినేటెడ్ సభ్యుడు స్టీఫెన్ సన్ కు 50 లక్షలు ఎరచూపారని నాటి టీడీపీ నేత రేవంత్ రెడ్డిపై కేసును నమోదు చేశారు.
అవినీతి నిరోధక శాఖ అధికారులు నిర్వహించిన సీక్రేట్ ఆపరేషన్ లో రేవంత్ రెడ్డి స్టీఫెన్ సన్ తో మాట్లాడిన వీడియో బయటికి వచ్చింది. దీంతో రేవంత్ రెడ్డిని అరెస్టు చేసి జైలుకు పంపారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్టీఫెన్ సన్ తో మాట్లాడినట్టు ఆయన ఆడియో టేపులు కూడా లీకయ్యాయి. దీనిపై పెద్ద దుమారమే రేగింది. క్రమంగా పరిస్థితులు చక్కబడ్డాయి.
అయితే ఎన్నికలకు అన్ని పార్టీలు సమాయత్తం అవుతున్న సమయంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలపై ముఖ్యంత్రి ఆరాతీసినట్టుగా జరుగుతున్న ప్రచారం తిరిగి రాజకీయ వర్గాల్లో కలవరం రేపుతోంది. ఈ కేసు తరువాత తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రుల మధ్య విపరీతమైన దూరం పెరిగిన సంగతి తెలిసిందే. ఓ దశలో చంద్రబాబును అరెస్టు చేస్తారంటూ జోరుగా ప్రచారం సాగినప్పటికీ క్రమంగా పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య దూరం తగ్గిందనే ప్రచారం కూడా జరిగింది. ఓ పెద్దాయన చొరవతో ఇద్దరు సీఎంలు సయోధ్యకు అంగీకరించారని కూడా అప్పట్లో జోరుగా ప్రచారం సాగింది.
ఈ కేసు విషయంలో తిరిగి కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నట్టు ప్రస్తుతం రాజకీయవర్గాల్లో ఊహాగానాలు కొనసాగుతున్నాయి. తెలుగుదేశం పార్టీని విడిచి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటుగా ఆయన కుటుంబం పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. రేవంత్ కు చెక్ పెట్టడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తిరిగి నోటుకు ఓటు కేసును తెరపైకి తీసుకుని వస్తున్నట్టు రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
అయితే ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు ముమ్మరం అయితే తిరిగి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్రపై కూడా దుమారం రేగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. రేవంత్ ను ఇరుకున పెట్టే క్రమంలో చంద్రబాబు ను సైతం ఢి కొట్టేందుకు కేసీఆర్ సై అంటారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
గత ప్రభుత్వ హయాంలో నమోదయిన ఓ కేసుకు సంబంధించిన వివరాలపై కూడా కేసీఆర్ ఆరా తీసినట్టు తెలుస్తోంది. ఇందులో నాటి హౌసింగ్ శాఖ మంత్రి ప్రస్తుత ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ పై కూడా అభియోగాలు నమోదయ్యాయి. బీసీలకు కేటాయించాల్సిన గృహాలను ఇతరులకు కేటాయించారని, ఇందులో భారిగా అవకతవకలు చోటుచేసుకున్నాయనే అభియోగాలున్నాయి.
మొత్తం మీద తిరిగి రాజకీయ నేతల ప్రమేయం ఉన్న కేసుల విషయంలో కేసీఆర్ మరింత దూకుడుగా వెళ్తున్నారే వార్తలు వస్తున్నాయి. అయితే మరో వైపు ఇది కేవలం ప్రచారం మాత్రమేనని ఓటుకు నోటు కేసుకు సంబంధించి కేసీఆర్-చంద్రబాబులు కుమ్మక్కయ్యారనే ఆరోపణల నుండి తప్పించుకునేందుకు ఇటుంటి లీక్ లు ఇస్తారనే వాదన కూడా ఉంది.
chandrababu naidu, note for vote, not to vote case, kcr.

జులైనాటికి ఎల్బీనగర్ -అమీర్ పేట మార్గంలోనూ మెట్రో రైలు పరుగులు


kaleshwaram/
Telangana