పదివేల పరుగుల క్లబ్ లో విరాట్

విరాట్ కోహ్లీ… ఆ పేరు వింటే చాలు భారత క్రికెట్ ప్రేమికుల ఒళ్లు పులకరిస్తుంది. అసామాన్య బ్యాటింగ్ నైపుణ్యంతో పరుగుల వరద పారించే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో 10వేల పరుగుల క్లబ్‌లో చోటు దక్కించుకున్నాడు. కేవలం 213 వన్డేలలోనే 10వేల పరుగులు సాధించి, అగ్రస్థానంలో నిలిచిన దిగ్గజ ఆటగాడు సచిన్ తెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. రెండు దశాబ్దాల కిందట క్రికెట్‌లో అడుగుపెట్టిన కోహ్లీ 29 ఏళ్ల ప్రాయంలోనే ఎన్నో రికార్డులను తిరగరాశాడు. సచిన్ తెండూల్కర్ 259 ఇన్నింగ్స్‌ల్లో (266 వన్డేలు) 10వేల పరుగులు సాధించగా, విరాట్ కోహ్లీ 205 ఇన్నింగ్స్‌ల్లోనే (213 వన్డేలు) ఈ ఘనత సాధించాడు. దీంతో 10వేల పరుగులు చేసిన 13 మంది బ్యాట్స్‌మెన్‌లలో కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. అంతేకాకుండా ఈ ఘనత సాధించిన ఐదో భారత క్రికెటర్‌గా కూడా రికార్డు పుటల్లోకి ఎక్కాడు.