సినీ నటి దర్శకురాలు విజయనిర్మల మృతి

0
72

ప్రముఖ నటి, దర్శకురాలు, సూపర్ స్టార్ కృష్ణ సతీమణి విజయనిర్మల కన్నుమూశారు. ఆమెకు 73 సంవత్సరాలు గచ్చిబౌలిలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె బుధవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. కొంత కాలంగా విజయనిర్మల అనారోగ్యంతో బాధపడుతున్నారు. విజయ నిర్మల 1946 ఫిబ్రవరి 20న తమిళనాడులో జన్మించారు. అమె తండ్రి తమిళనాడుకు చెందిన వ్యక్తి కాగా తల్లిది గుంటూరు జిల్లా నరసరావుపేట. తన మొదటి భర్త తో విడిపోయిన తరువాత సూపర్ స్టార్ కృష్ణను ఆమె వివాహం చేసుకున్నారు. విజయ నిర్మల కుమారుడే ప్రముఖ నటుడు నరేష్.
నటి జయసుధకు ఈమె పిన్ని. 1950లో మత్య్సరేఖ అనే తమిళ చిత్రం ద్వారా విజయనిర్మల తన ఏడో ఏటనే బాల నటిగా సినీ రంగ ప్రవేశం చేశారు. ‘పాండురంగ మహత్యం’ చిత్రం ద్వారా తెలుగులో బాల నటిగా పరిచయం అయ్యారు. ‘రంగులరాట్నం’ చిత్రం ద్వారా హీరోయిన్ గా మారారు. 200కు పైగా తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో ఆమె నటించారు. పూల రంగడు, సాక్షి, అసాధ్యుడు, బంగారు గాజులు, బొమ్మా బొరుసు, మోసగాళ్లకు మోసగాడు, పండంటి కాపురం, పాడిపంటలు, అల్లూరి సీతరామరాజు, తాతామనవడు, మీనా, మారిన మనిషి, కురుక్షేత్రం, పిన్నీ తదితర చిత్రాల్లో నటించారు.
ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు (44) దర్శకత్వం వహించిన తొలి మహిళా దర్శకురాలిగా ఆమె 2002లో గిన్నీస్‌ బుక్‌లో చోటు సంపాదించారు. తొలిసారి ఆమె ‘మీనా’ అనే చిత్రాన్ని 1971లో తెరకెక్కించగా.. అప్పటి నుంచి 2009 వరకూ మొత్తం 44 సినిమాలు తీశారు. దేవదాసు, దేవుడే గెలిచాడు, రౌడీ రంగమ్మ, మూడు పువ్వులు ఆరు కాయలు, హేమా హేమీలు, రామ్‌ రాబర్ట్‌ రహీం, సిరిమల్లె నవ్వింది, భోగి మంటలు, బెజవాడ బెబ్బులి, ముఖ్యమంత్రి, లంకె బిందెలు, కలెక్టర్‌ విజయ, ప్రజల మనిషి, మొగుడు పెళ్లాల దొంగాట, పుట్టింటి గౌరవం, రెండు కుటుంబాల కథ వంటి చిత్రాలకు ఆమె దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. సొంత నిర్మాణ సంస్థ విజయకృష్ణ పతాకంపై 15కుపైగా చిత్రాలను నిర్మించారు.

Wanna Share it with loved ones?