ఉత్తమ్ ఢిల్లీ పర్యటనకు అసలు కారణం ఇదేనా…!

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై కాంగ్రెస్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ముందుగా ఎటువంటి ప్రణాళిక లేకున్నా హుటాహుటిన ఢిల్లీకి వెళ్లిన ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడ పార్టీ పెద్దలతో సమావేశమయ్యారు. పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జీ కుంతియాతో సమావేశమైన ఆయన మరికొంత మంది పార్టీ పెద్దలను కూడా కలిసినట్టు తెలుస్తోంది. ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల్లో బిజీగా ఉండడంతో పార్టీ అధినేత రాహుల్ గాంధీని మాత్రం ఉత్తమ్ కుమార్ రెడ్డి కలవలేకపోయారు. కాంగ్రెస్ కీలక నేత జనార్థన్ ద్వివేదిని కలవాడానికి కూడా ఉత్తమ్ కుమార్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదని సమాచారం.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత రాహుల్ గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులని ఎవరినీ మార్చేదిలేదని రాహుల్ గాంధీ నిర్ణయించి ఈ మేరకు వివిధ రాష్ట్రాల అధ్యక్షులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. తమ నేత అధ్యక్షపదవికి ఎటువంటి ఢోకా లేదని తేలిపోవడంతో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుచరులు గాంధీ భవన్ వద్ద హంగామా చేశారు. టపాకాయలు కాలుస్తూ సందడి చేశారు. దీనిపై అధిష్టానానికి ఫిర్యాదు అందడంతో ఉత్తమ్ ను ఢిల్లీకి పిలిపించినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షపదవి కోసం చాలా మంది నేతలు కాచుకుని కూర్చున్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లాంటి నేతలు బహిరంగంగానే తన మనసులోని మాటను బయటపెట్టగా మరికొంత మంది నేతలు మాత్రం తెరవెనుక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఒకవైపు పార్టీ అధిష్టానం అధ్యక్షుడిని మార్చడం లేదంటూ సమాచారం ఇవ్వడం దానికి తోడు ఉత్తమ్ వర్గం సంబరాలు చేసుకోవడంతో కడుపు కాలిన నేతలు ఢిల్లీ పెద్దలకు ఉత్తమ్ పై ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. పైకి మాత్రం సమ్మక్క సారక్క జాతరకు రాహుల్ గాంధీని పిలవడం కోసమే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారని చెప్తున్నప్పటికీ అసలు విషయం మాత్రం వేరే ఉందని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *