తండ్రీ కొడుకుల రాజీ

సమాజ్ వాదీ పార్టీలో ఏర్పడిన సంక్షేభం 24 గంటలు గడవక ముందే సమసిపోయింది.  సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థుల ఎంపికలో పార్టీ అధ్యక్షుడు ములాయంసింగ్, కుమారుడు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ల మధ్య నెలకొన్న వివాదం టీకప్పులో తుపాను మాదిరిగా సమసిపోయింది. తన కుమారుడు అఖిలేష్ యాదవ్, సోదరుడు రాంగోపాల్ యాదవ్ లను పార్టీ నుండి ఆరు సంవత్సరాల పాటు బహిష్కరిస్తున్నట్టు ప్రకటించిన మాలయం తన నిర్ణయం పై వెనక్కి తగ్గారు. కుమారుడు, సోదరుడిని పార్టీ నుండి బహిష్కరిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. తమ మధ్య అవగాహన కుదిరిందని బహిష్కరణ ఉండదని ములాయం స్వయంగా ప్రకటించారు.
ములాయం తన నిర్ణయాన్ని మార్చుకోవడం వెనుక పెద్ద తతంగమే నడిచింది. ములాయం అఖిలేష్ ను పార్టీ నుండి బహిష్కరించిన వెంటనే అఖిలేష్ వర్గం బల ప్రదర్శనకు దిగింది. పార్టీ ఎమ్మెల్యేలు దాదాపు 230 మంది ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎమ్మెల్యేలతో పాటుగా పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు కార్యకర్తలు కూడా అఖిలేష్ కు మద్దతు పలికారు. దీనితో పాటుగా జాతీయ నాయకులు రంగంలోకి దిగి కుటుంబ పోరు వల్ల సమాజ్ వాదీ పార్టీ తద్వారా లౌకిక కూటమి దెబ్బతింటుందని ములాయంకు నచ్చచెప్పినట్టు సమాచారం. తెగేదాకా లాగడం వల్ల ఇరు వర్గాలు నష్టపోతాయని అటు అఖిలేష్ ను కూడా బుజ్జగించడంతో తండ్రీ కొడుకులు ఒక్కటయ్యారు.
మరో వైపు తండ్రితో విభేదించి అఖిలేష్ బయటకు వస్తే ఆయనతో పొత్తుకు తాము సిద్ధంగా ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ సంకేతాలు పంపింది. ఈ పరిణామాలన్నింటినీ బేరూజు వేసుకున్న తరువాత తన నిర్ణయాన్ని ములాయం మార్చుకున్నట్టు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *