మహిళను చెప్పుతో కొట్టిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ

ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ ఒక మహిళను చొప్పుతో కొట్టిన ఘటన కలకలం రేపుతోంది. అమెరికాలో ఉంటున్న ఒక మహిళకు నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఫ్లాట్ ఉంది. ఎమ్మెల్సీ ఫారుక్ ప్రస్తుతం ఆ ఇంటిలో నివాసం ఉంటున్నారు. గత రెండు సంవత్సరాలుగా ఇంటిని ఖాళీ చేయకుండా తనను వేధిస్తున్నారంటూ సదరు మహిళ వాపోతోంది. ఈ క్రమంలో అమెరికా నుండి వచ్చిన మహిళ ఇల్లు ఖాళీ చేయాల్సిందిగా కోరగా ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో అంటూ ఫారుక్ ఆమెను తీవ్ర పదజాలంతో దూషించడంతో పాటుగా సదరు మహిళను చెప్పుతో కొట్టిన దృశ్యాలను మహిళతో పాటు వచ్చిన వారు రికార్డు చేశారు. ఎమ్మెల్సీ ఫారూక్ పై ఆ మహిళ నాంపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఫారూక్ ప్రస్తుతం టీఆర్ఎస్ లో చేరారు.
గత ఏడు సంవత్సరాలుగా తన ఫ్లాట్ లో అద్దెకుంటున్న ఫారుక్ నామమాత్రపు అద్దె చెల్లిస్తున్నాడని గత ఆరు నెలలుగా అది కూడా కట్టడం లేదని సదరు మహిళ వాపోయింది. అద్దె ఇవ్వకపోవడంతో పాటుగా తనను బెదిరిస్తున్నాడని ఆ మహిళ అంటోంది. తాను అధికార పార్టీలో ఉన్నానని తనను ఎవరూ ఏమీ చేయలేరంటూ బెదిరిస్తున్నాడని మహిళ చేప్తోంది. ఎమ్మెల్సీ ఫారూక్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేస్తోంది.