టీఆర్ఎస్ సభ హిట్టా…? ఫట్టా…?

trs meeting తెలంగాణ రాష్ట్రసమితి (టీఆర్ఎస్) హైదరాబాద్ నగర శివార్లలోని కొంగర్ కలాన్ లో నిర్వహించిన ప్రగతి నివేదన సభ పై రాజకీయ వర్గాలతో పాటుగా సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చజరుగుతోంది. టీఆర్ఎస్ సభ ఆశించినదానికన్నా ఎక్కువ విజయవంతం అయిందని లక్షలాది మంది ప్రజలు సభకు హాజరయ్యారని టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు ప్రచారం చేస్తున్నారు. సమాయానికి సభాస్థలికి చేరుకోలేక ఐదు లక్షల మందికి పైగా ప్రజలు రోడ్లపైనే ఉండిపోయారని వారు చెప్తున్నారు. అత్యంత విశాలమైన సభాస్థలి కూడా కిక్కిరిసిపోయిందని చెప్తూ ఏరియల్ ఫొటోలను వారు చూపిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆశించినట్టుగానే 25 లక్షల మందికి పైగా ప్రజలు ప్రగతి నివేదనకు వచ్చారని టీఆర్ఎస్ వర్గాలు ప్రచారం చేస్తుండగా విపక్షాలు మాత్రం అంతసీన్ లేదని అంటున్నాయి.
సభాస్థలిని మొత్తంగా చూసినా పదిలక్షల మందికన్నా ఎక్కువ పట్టే అవకాశం లేదని అందులోనూ సగం కూడా నిండలేదని అంటున్నాయి. భారీగా డబ్బులు వెదజల్లి జనాలను సభకు తరలించే ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందనేది విపక్షాల వాదన. అధికార దుర్వినియోగం చేయడంతో పాటుగా ప్రైవేటు స్కూళ్లు, కాలేజీ యాజమాన్యాలను బెదిరించి మరీ బస్సులు పెట్టినా ప్రయోజనం లేకుండా పోయిందని విపక్షాలు అంటున్నాయి. ఎన్నిరకాల ప్రలోభాలు కల్పించినా ప్రజలు లేక సభ తుస్సు మందని అంటున్నారు.
ప్రగతి నివేదన సభకు లక్షవాహనాలు వచ్చాయని టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. విశాలమైన జౌటర్ రింగ్ రోడ్డు పూర్తిగా వాహనాలతో నిండిపోయిందని గంటలతరబడి వాహనాలు ట్రాఫిక్ లో చిక్కుకుని పోయాయని పోలీసు లెక్కల ప్రకారం లక్షకు పైగా వాహనాలు వచ్చాయని కనీసం మరో లక్ష చిన్న వాహనాల ద్వారా ప్రజలు తరలివచ్చారని దీన్ని బట్టి ఎంత మంది సభకు వచ్చారో అంచానా వేసుకోవచ్చని టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. సభాస్థలికి కొన్ని కిలోమీటర్ల దూరం నుంచే ప్రజలు కాలినడకన సభాస్థలికి చేరుకున్నారని వారంటున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రగతి నివేదన సభకు తరలివచ్చారని గతంలో ఇంత భారీ స్థాయిలో ఎప్పుడూ సభ జరగలేదంటున్నారు.
గతంలో టీఆర్ఎస్ వరంగల్ లో నిర్వహించిన భారీ సభకన్నా చాలా ఎక్కువ సంఖ్యలో వచ్చారని అంటున్నారు. టీఆర్ఎస్ అభిమానులు వ్యతిరేకుల మధ్య సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ప్రగతి నివేదన సభ చర్చ పరిధులుదాడి వ్యక్తిగత దూషణల స్థాయికి చేరుకుంది.
తెలుగు వార్తా ఛానళ్లోతోపాటుగా వార్తా పత్రికలు కూడా సభ పూర్తిగా విజయవంతం అయిందనే చెప్తున్నాయి. లక్షలాదిగా ప్రజలు తరలివచ్చారని చెప్తున్నప్పటికీ ఎంత మంది సభకు వచ్చిఉంటారనే దానిపై ఎవరూ స్పష్టంగా ఒక లెక్క చెప్పలేకపోతున్నారు. సభలో ముఖ్యమంత్రి ప్రసంగం పై కూడా వాడివేడి చర్చలు జరుగుతున్నాయి. కేసీఆర్ ప్రసంగంలో వాడీవేడీ తగ్గిందని కొందరు అభిప్రాయపడుతుండగా వ్యూహాత్మకంగా వ్యవహరించిన ఆయన గత నాలుగు సంవత్సరాల్లో చేసింది చెప్పారు తప్ప విపక్షాలపై విరచుకుపడేందుకు సమయం కేటాయించలేదంటున్నారు. ఏది ఏమైనా టీఆర్ఎస్ సభ హిట్టా… ఫట్టా అనే చర్చమాత్రం సర్వత్రా జరుగుతోంది.
ఇంత తక్కువ సమయంలో టీఆర్ఎస్ ఎందుకు సభను ఏర్పాటు చేయాల్సి వచ్చింది? ఏం ఆశించి సభను ఏర్పాటు చేశారనే విషయాన్ని గురించి ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఇంత భారీ స్థాయిలో తక్కువ సమయంలో ఏర్పాటు చేసిన సభ వారి అంచానాలను చేరుకుందా అనే విషయం పార్టీ అగ్రనాయకత్వానికే ఎరుక.

కొంగర్ కలాన్ సభలో కేసీఆర్ ముందస్తు సంకేతాలు


కమలం నేతలకు ముందస్తు గుబులు