ముగిసిన కొంగర్ కలాన్ సభ

హైదరాబాద్ నగర శివార్లలోని కొంగర్ కలాన్ లో తెలంగాణ రాష్ట్రసమితి (టీఆర్ఎస్) ఏర్పాటు చేసిన సభ విజయవంతం అయింది. రాష్ట్రం నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ కార్యకర్తలు అభిమానులు ప్రగతి నివేదన సభకు వచ్చారు. మధ్యాహ్నం నుండే సభాస్థలికి కార్యకర్తల రాక మొదలయింది. సాయంత్రానికల్లా సభా ప్రాంగణమంతా జనంతో కిటకిటలాడింది. ఔటర్ లో వాహనాలు నిల్చిపోవడంతో వాహనాలు దిగిన కార్యకర్తలు సభాస్థలికి నడుచుకుంటూ వచ్చారు. వేలాది వాహనాలతో జౌటర్ రింగ్ రోడ్డు కిక్కిరిసిపోయింది. లక్షలాదిమంది జనంతో కొంగర్ కలాన్ పోటెత్తింది.
జై తెలంగాణ, జై కేసీఆర్ అనే నినాదాలతో సభాస్థలి మార్మోగిపోయింది. కళాకారుల ధూంధాం కార్యక్రమాలు సభకు వచ్చినవారిలో ఉత్సాహాన్ని నింపాయి. తెలంగాణ కళారూపాలు, పాటలు, నృత్యాలతో కొంగర్ కలాన్ వేదిక దద్దరిల్లింది. ఎక్కడ చూసినా కార్యకర్తల్లో ఉత్సాహం నిండిపోయింది. శనివారం రాత్రి ఇబ్బంది పెట్టినా సభకు వాతావరణం ఎటువంటి ఆటకం కలిగించలేదు.
టీఆర్ఎస్ మంత్రులు, నాయకులకు సభలో ప్రసంగించే అవకాశం వచ్చినా వారు కొద్ది సేపటికే తమ ప్రసంగాలను ముగించారు. సింహభాగం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగానికే కేటాయించారు. అన్ని అంశాలను గురించి మాట్లాడిన కేసీఆర్ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. రానున్నది తమ ప్రభుత్వమేనని మరోసారి టీఆర్ఎస్ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని సీఎం చెప్పారు.
రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, మహేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, మహమూద్‌ అలీ, నాయిని నర్సింహారెడ్డి, ఈటల రాజేందర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, పద్మారావు, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తెరాస ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభావేదికపై ఉన్నారు.