త్రిపురలో ఓడలుగా మారిన బండ్లు

ఓడలు బండ్లు…బండ్లు ఓడలు కావడం అంటే ఇదే. త్రిపురలో కమ్యునిష్టులదే హవా. ఆపార్టీనే అప్రతిహతంగా విజయాలు నమోదు చేసుకుంటూ వస్తోంది. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్రను పోషిస్తూ వస్తోంది. ఇక్కడ బీజేపీ ఉనికే కనిపించేది కాదు. జాతీయ పార్టీ బీజేపీకి త్రిపురలో ఏమాత్రం పట్టులేదు. అన్ని నియోజకవర్గాల నుండి పోటీ చేసేందుకు సరైన అభ్యర్థులు కూడా కరువైన పరిస్థితి. గెలుపు మాట దేవుడెరుకు కనీసం డిపాజిట్లు సంపాదించుకోవడం కూడా గగనమే అయితే ఇది గతం.
కమ్యూనిస్టుల కంచుకోట త్రిపురలో కాషాయ జెండాలు రెపరెపలాడుతున్నాయి. ఎరుపు వెలిసిపోగా కాంగ్రెస్ పార్టీ ఉనికే లేకుండా పోయింది. 60 నియోజకవర్గాలున్నా చిన్న రాష్ట్రం త్రిపురను బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. మొదటిసారిగా ఇక్కడ ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. త్రిపుర ప్రజలు బీజేపీకి స్పష్టమైన ఆదిఖ్యాన్ని ఇచ్చారు. అవినీతి మరకలు లేని సీపీఎం ముఖ్యమంత్రి మాణిక్ సర్కారు ప్రభుత్వం కన్నా అభిమంత్రం జపించిన బీజేపీనే ఇక్కడి ప్రజలు ఎక్కువగా నమ్మారు. నాలుగు దఫాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న మాణిక్ సర్కార్ ను ఇంటికి పంపి బీజేపీ జైకొట్టిన త్రిపుర ప్రజలు అభివృద్ధి నినాదంతో ముందుకు వచ్చిన బీజేపీని ఆదరించారు.
త్రిపురలో బీజేపీ పాగా వేయడం పూర్తిగా ప్రధాని నరేంద్ర మోడి ఘనతగానా చెప్పుకోవచ్చు. త్రిపురలో సుడిగాలి పర్యటనలు జరిపిన ఆయన అభివృద్ధి నినాదాన్ని అందుకున్నారు. అవినీతి మచ్చలు లేకున్నా త్రిపుర అన్ని రంగాల్లోనూ వెనుకబడి ఉందని దీనికి కారణం ఇక్కడి సీపీఎం ప్రభుత్వమేనని ప్రజల్లో నమ్మకాన్ని కలిగించిన మోడి తాము అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామంటూ నమ్మకాన్ని కలిగించారు. దీనితో పాటుగా అమిత్ షా వ్యూహాలు స్థానికంగా బలంగా ఉన్న పార్టీలతో పొత్తు వెరసి బీజేపీ త్రిపురలో పాగా వేయగలిగింది.
గత ఎన్నికల్లో 50 స్థానాలకు పోటీచేసిన బీజేపీ 49 చోట్ల కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేక చతికిల బడగా ఈ దఫా ఏకంగా అధికారంలోకి వచ్చింది.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *