తెలుగు వెలుగులు…

ప్రపంచ తెలుగు మహాసభలకు ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. మన తెలుగు భాష తీయదనాన్ని, గొప్పతనాన్ని చాటడానికి ఉద్దేశించిన ఈ సభలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ సర్కారు అన్ని ఏర్పాట్లును పూర్తి చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా తెలుగు భాషాభిమాని, రచయిత కావడంతో ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ సమావేశాలకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశంలోని ఇతర రాష్ట్రాలనుంచే కాకుండా దాదాపు 40 దేశాల నుండి ప్రతినిధులు హాజరవుతున్నారు. మాతృభాషలోని మాధుర్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయడమే లక్ష్యంగా జరుగుతున్న ఈ సభల్లో తెలుగుదనం ఉట్టిపడేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
మొదటి నుండి తెలంగాణ యాస, భాష, సంస్కృతి, సాహిత్యం మరుగునపడిందని భావిస్తున్న తెలంగాణ సర్కారు అందుకు అనుగుణంగా తెలంగాణ కవులు, సాహిత్యకారులకు పెద్దపీట వేస్తోంది. తెలంగాణ కవులకు దక్కాల్సినంత గౌరవం దక్కలేదనే సంగతిని గుర్తుచేస్తూ వారికి సంబందించిన విషయాలను వెలుగులోకి తీసుకుని వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సభల ద్వారా తెలంగాణ కవులకు దక్కకుండా పోయిన గౌరవం దక్కే ప్రయత్నాలు చేస్తున్నట్టు నిర్వాహకులు చెప్తున్నారు. అదే సమయంలో తెలుగు కవులందరికీ సముచిత స్థానం ఉంటుందని చెప్తున్నారు. ఇది తెలుగు ప్రజలందరికీ సంబంధించిన కార్యక్రమం అని రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారికీ తగినంత గౌరవం దక్కుంతని అంటున్నారు.
ఇంర్మిడియట్ వరకు తెలుగును తప్పనిసరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. తెలుగు వాడకం రోజురోజుకీ తగ్గిపోతున్న నేపధ్యంలో భాషా జౌన్నాత్యాన్ని తెలపడంతో పాటుగా తెలుగు భాషను బతికించుకోవాల్సిన అవసరం ఏర్పడిన ప్రస్తుత పరిస్థితుల్లో నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలపై భాషాభిమానులు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. తెలుగులో తమ పేరును సైతం రాయలేని వారు ఎందరో. తెలుగు రాదని చెప్పడం ఇప్పుడో గొప్పతనంగా మారిపోయింది. పాఠశాలలు, కళాశాలల్లో తెలుగుకు తెగులు పట్టింది. పరభాషా వ్యామోహంలో కొట్టుకునిపోతూ తెలుగు ను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్న సమయంలో భాషను బతికించే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రపంచ తెలుగు మహాసభలకు జేజేలు పలుకుదాం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *