ఓట్లు వేసి గెలిపించిన వారిని మోసం చేయడమే

తెలంగాణ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున గెల్చిన ఎమ్మెల్యేల సంఖ్య 19. వారిలో ఇప్పటికే 12 మంది టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇంకొరిద్దరు కూడా టీఆర్ఎస్ లో చేరడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. దీనితో కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని టీఆర్ఎస్ శాసనసభాపక్షంలో విలీనం చేయడం ఇక లాంఛనమే. పార్టీలు మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడకుండా ఉండేందుకు గాను గెల్చిన సభ్యుల్లో రెండితల మూడు శాతం అంటే 13 మంది పార్టీ మారితే వారిపై అనర్హత వేటు పడే అవకాశం లేదు. టీఆర్ఎస్ ఇప్పుడు ఇదే పంథాను ఎంచుకుంది. గతంలో టీడీపీని ఇదే విధంగా తమ పార్టీలో కలిపేసుకున్న టీఆర్ఎస్ శాసనమండలిలో కాంగ్రెస్ పక్షాన్ని తమ పార్టీలో విలీనం చేసుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని తలలో కలిపేసునేందుకు రంగం సిద్ధమయిపోయింది.
తమ ఎమ్మెల్యేలను రకరకాల ప్రలోభాలకు గురిచేసినందునే వారు పార్టీలు మారుతున్నారంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తుండగా తమ అభివృద్ధి కార్యక్రమాలు చూసి నచ్చే విపక్ష ఎమ్మెల్యేలు తమ పంచన చేరుతున్నారని అధికార పార్టీ ప్రకటించుకుంటోంది. పార్టీలు మారుతున్న ఎమ్మెల్యేలు మాత్రం నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలో పాటుగా కార్యకర్తల అభిష్టం మేరకు పార్టీలు మారుతున్నట్టు చెప్తున్నారు. ఎమ్మెల్యేలు పైకి చేస్తున్న ప్రకటనలకు వాస్తవాలకి ఉన్న తేడాను ప్రజలు సులభంగానే గుర్తిస్తున్నారు.
ఎన్నికల ముందు వరకు అధికార పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన నేతలు తీరా ఎమ్మెల్యేలుగా గెల్చిన తరువాత వారికి ఆ పార్టీలోని గొప్పతనం కనిపిస్తున్నట్టుంది. వ్యక్తిగత గత ఎమేజ్ కావచ్చు, పార్టీకి ఉన్న ఆదరణ కావచ్చు ఒక పార్టీ తరపున గెల్చిన తరువాత ఆ పార్టీని వదిలి ఇతర పార్టీలోకి వలస పోవడం అంటే ఓట్లు వేసి గెలిపించిన వారిని మోసం చేయడమేననే వాదనను కొంత మంది వినిపిస్తున్నారు. అధికార పార్టీని వద్దనుకుని సదరు వ్యక్తికి ఓటు వేసి గెలిపిస్తో తీరా అతను పార్టీని వదిలి వెళ్లిపోయాడని దీని వల్ల తమకు రాజకీయ వ్యవస్థపై నమ్మకం పోతోందని ఎల్బీనగర్ కు చెందిన ఓటరు ఒకరు వాపోయారు.
రాజకీయాలు పూర్తిగా ఖరీదైన వ్యవహారంగా మారిపోవడం అధికారానికి దూరంగా ఉండడం ఎమ్మెల్యేలకు సాధ్యం కావడం లేదు. అధికార పార్టీ అండదండలు లేకుండా ఆర్థికంగా నిలదొక్కుకపోవడం అషామాషీ వ్యవహారం కాదు. తమతో పాటు తమ వర్గీయులకు మేలు జరగాలంటే అధికార పార్టీలో చేరడం ఒక్కటే మార్గమనే విషయాన్ని ఎమ్మెల్యేలు బహిరంగంగానే అంగీకరిస్తున్నారు. పార్టీల విధానాలు, ఇతరత్రా అంశాలకన్నా ఇక్కడ ఆర్థిక అంశాలే ప్రధాన పాత్రను పోషిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఆర్థికంగా బలపడడంతో పాటుగా అధికారం, తమ వర్గీయులకు పదవులు ఇప్పించుకోవడం వంటి వాటి కోసం ఇంత మంది ఎమ్మెల్యేలు గోడదూకున్నారనేది మాత్రం వాస్తవం.
టీఆర్ఎస్ లో కాంగ్రెస్ ఎల్పీ విలీనం పూర్తి