మళ్లీ ఎన్నికలా…టీఅర్ఎస్ ఎమ్మెల్యేలో భయం..భయం..

0
43

ఎన్నికలంటే పార్టీల కార్యకర్తలకు పండగే… కానీ నాయకుల పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నం… ఎన్నికలు వస్తున్నాయంటేనే భయపడే స్థితికి వివిధ పార్టీల నేతలు చేరుకున్నారు… ప్రస్తుతం తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనుండడంతో పాటుగా ఈ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని అధికార టీఆర్ఎస్ తన పార్టీనేతలకు ఆదేశాలు జారీ చేసింది. పార్టీ ఎమ్మెల్యేలే గెపుబాధ్యతను తీసుకోవాలంటూ అదేశాలు ఇవ్వడంతో పార్టీ ఎమ్మెల్యేలు ఢీలా పడిపోతున్నారు. ఇప్పటికే మూడు ఎన్నికల కోసం నానా తిప్పలు పడ్డామని ఇప్పుడు మరోసారి ఎన్నికల కోసం సమాయత్తం కావడం తలకుమించిన భారంగా మారుతోందని వారంటున్నారు.
తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచే నాటి ఎమ్మెల్యే అభ్యర్థులు కార్యకర్తలను తమ వెంట ఉంచుకోవడం మొదలు పెట్టారు. అన్ని రకాలుగా కార్యకర్తలు, చిన్న స్థాయి నేతల బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత నాటి అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల పైనే పడింది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ఫలితాలు వచ్చిన వెంటనే పంచాయితీ ఎన్నికలు వచ్చేశాయి. ఈ ఎన్నికలకు అభ్యర్థులను ఎంపికచేయడం దగ్గర నుండి వారిని గెలిపించుకునే బాధ్యత కూడా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలపైనే పడింది. పంచాయితీ ఎన్నికల సందర్భంగా కూడా ఎమ్మెల్యేలపై భారీగానే ఆర్థిక భారం పడింది.
పంచాయితీ ఎన్నికలు ముగిసిన వెంటనే తెలంగాణలో లోక్ సభ ఎన్నికల నగారా మోగింది. మధ్యలో ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా కొన్ని చోట్ల జరిగిపోయాయి. తెలంగాణలో మొదటి దశలోనే లోక్ సభ ఎన్నికలు జరిగిపోయాయి. ఇటు లోక్ సభ ఎన్నికల సందర్భంలోనూ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యతను పార్టీ అధిష్టానం ఎమ్మెల్యేలపైనే ఉంచింది. లోక్ సభ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల ఆధారంగానే ఎమ్మెల్యేల పనితీరును బేరూజు వేస్తామని పార్టీ అధినాకత్వం బహిరంగంగానే ప్రకటించడంతో లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అన్నీ తామై వ్యవహరించారు. వారి కోసం అన్ని రకాలుగా కష్టపడ్డారు. ముఖ్యంగా కొత్తగా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారితో పాటుగా మంత్రి పదవులు ఆశిస్తున్న వారు మరింత కష్టపడాల్సి వచ్చింది. లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడం కోసం పలుగు, రాత్రీ తేడా లేకుండా ఎమ్మెల్యేలు కష్టపడ్డారు. చాలా నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ కొత్త అభ్యర్థులను రంగంలోకి దింపడంతో ఎమ్మెల్యేలపై మరింత భారతం పడింది.
లోక్ సభ ఎన్నికలు అయిపోయి ఇంకా ఫలితాలు రాకముందే స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన వెలువడింది. ఈ ఎన్నికల భారం కూడా టీఆర్ఎస్ అధిష్టానం ఎమ్మెల్యేలపైనే ఉంచింది. వరుస ఎన్నికలతో ఊపిరి సలపని పరిస్థితులు ఉన్నాయని ఇన్ని రోజులు పార్టీ కార్యకర్తలను, ద్వితీయ శ్రేణి నాయకులను జాగ్రత్తగా చూసుకోవడం తలకుమించిన భారంగా మారుతోందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒకరు తెలంగాణ హెడ్ లైన్స్ వద్ద వాపోయారు. వరుస ఎన్నికలతో ఆర్థికంగా తీవ్ర భారం పడుతోందని దీనికి తోడు ఫలితాలు ఏమాత్రం వ్యతిరేకంగా వచ్చినా అధిష్టానం నుండి చీవాట్లు తప్పవని దీనితో నిత్యం ఒత్తిడితో పనిచేయాల్సి వస్తోందని సదరు ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్ర స్థాయిలో తమ పార్టీకి ప్రజల్లో బలం ఉన్నప్పటికీ వరుస ఎన్నికలతో పార్టీ కార్యకర్తలను ఎప్పటికప్పుడు సమాయత్తం చేయడం అషామాషీ వ్యవహారం కాదని ఎమ్మెల్యేలు వాపోతున్నారు. మొత్తం మీద తెలంగాణలో వరుస ఎన్నికలు పార్టీ నేతలకు తలకుమించిన భారంగా మారుతోంది.

Wanna Share it with loved ones?