టీఆర్ఎస్ లో కాంగ్రెస్ ఎల్పీ విలీనం పూర్తి

తెలంగాణ అసెంబ్లీ లో విపక్షం అంటూ లేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది సభ్యులు అధికారికంగా టీఆర్ఎస్ పార్టీలో చేరడంతో పాటుగా మూడింత రెండు వంతుల మంది ఉండడంతో కాంగ్రెస్ శాసన సభా పక్షాన్ని టీఅర్ఎస్ లో విలీనం చేస్తున్నట్టు పార్టీ మారిన ఎమ్మెల్యేలు స్వీకర్ కు లేఖ ఇవ్వడం దాన్ని శాసనసభా పక్ష కార్యదర్శి ఆమోదించడం చక చకా జరిగిపోయాయి. దీనితో తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ బలం 6కు పడిపోయింది. కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందిన 12 మంది అభ్యర్థులు ఇక అధికారికంగా టీఆర్ఎస్ సభ్యులుగా మారిపోయారు.
నల్గొండ లోక్ సభ స్థానం నుండి గెలుపొందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్ శాసన సభా స్థానం నుండి గెలుపొందిన సంగతి తెలిసిందే. దీనితో ఉత్తం అసెంబ్లీకి రాజీనామా చేశారు. దీనితో కాంగ్రెస్ పార్టీ మొత్తం సభ్యుల సంఖ్య 18కు పడిపోయింది. దీనితో కాంగ్రెస్ శాసనసభా పక్షాన్ని విలీనం చేయడానికి అవసరం అయిన 12 మంది సభ్యుల బలం ఉండడంతో వెంటనే వారంతా ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటుగా టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ను కలిశారు. అటు నుండి నేరుగా స్పీకర్ ను కలిసి కాంగ్రెస్ శాసనసభా పక్షాన్ని టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేస్తున్నట్టు స్పీకర్ కు లేఖ ఇచ్చారు. ఈ లేఖ పై మహేశ్వరం నుంచి సబితా ఇంద్రారెడ్డి, ఎల్లారెడ్డి నుంచి జాజుల సురేందర్, పినపాక నుంచి రేగ కాంతారావు, పాలేరు నుంచి కందాల ఉపేందర్ రెడ్డి, ఇల్లందు నుంచి హరిప్రియ, కొత్తగూడెం నుంచి వనమా వెంకటేశ్వర రావు, నకిరేకల్ నుంచి చిరుమర్తి లింగయ్య, ఎల్బీనగర్‌ నుంచి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఆసిఫాబాద్‌ నుంచి ఆత్రం సక్కు, కొల్లాపూర్‌ నుంచి బీరం హర్షవర్ధన్ రెడ్డి, భూపాలపల్లి నుంచి గండ్ర వెంకటరమణారెడ్డి, తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి లు సంతకాలు చేశారు.
ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అప్రజాస్వామికంగా వ్యవహరించారని ఆరోపిస్తూ పీసీసీ అధ్యక్షుడు ఉత్తంతో పాటుగా మల్లూ భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు తదితరులు అసెంబ్లీ ఎదుట మౌన దీక్షకు దిగారు. వీరిని పోలీసులు అరెస్టు చేసి ఆ తరువాత విడిచి పెట్టారు.
టీఆర్ఎస్ తమ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకోవడం పై న్యాయ పోరాటం చేస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. ఒక ప్రాంతీయ పార్టీలోకి జాతీయ పార్టీని విలీనం చేయడం చట్టప్రకారం చెల్లదని దీనిపై కోర్టును ఆశ్రయిస్తామని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు.