తెరపైకి రాయలసీమ అంశం-టీడీపీని ఇరుకున పెట్టిన బీజేపీ

ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ లో ఇబ్బందులను ఎదుర్కొంటున్న బీజీపీ రాయలసీమ అభివృద్ధి అంశాన్ని తెరపైకి తీసుకుని వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కర్నూలు ను రెండో రాజధానిగా చేయాలంటూ కొత్త పల్లవిని అందుకుని టీడీపీని ఇరుకున పెట్టే ప్రయత్నం ప్రారంభించినట్టు కనిపిస్తోంది. కర్నూలులో సమావేశమైన బీజేపీ రాయలసీమ ముఖ్యనేతలు కర్నూలును ఏపీకి రెండవ రాజధానిగా చేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడ అసెంబ్లీ భవనాన్ని కట్టాలని, గవర్నర్ తాత్కాలిక విడిదిని నిర్మించాలంటూ డిమాండ్ చేశారు. రాయలసీమలోనే ఏపీ హై కోర్టును నిర్మించాలని వారు డిమాండ్ చేశారు. రాయలసీమలో ప్రస్తుతం ఉన్న నాలుగు జిల్లాలకు మరో నాలుగు జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
మరో వైపు అటు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోసారి టీడీపీపై విరుచుకుని పడ్డారు. చంద్రబాబు నాయుడిపై కూడా వీర్రాజు ఆరోపణలు చేశారు. గతంలో ప్రత్యేక హోదాపై గతంలో చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ బాబు ఇప్పుడు మాట మార్చడానికి కారణం ఏమిటని ప్రశ్నించారు. బీజేపీని ఇరుకున పెట్టేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.