అగమ్యగోచరంగా టీటీడీపీ

0
71

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లోకసభ ఎన్నికల్లో పోటీ చేస్తుందా అన్న ప్రశ్నకు పార్టీ ముఖ్యనేతలే సమాధానం ఇచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. నామినేషన్లు వసే గడువు ముగిపుకు చేరుకుంటున్నా ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై చర్చ కూడా జరగకపోవడంతో పార్టీలో పూర్తిగా అయోమయం నెలకొంది. అభ్యర్థులను నిలబెడుతుందా? లేక కాంగ్రెస్‌కు మద్దత్తు ఇస్తుందా అన్న అంశంపై నేతల్లో సందిగ్ధం నెలకొంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా దెబ్బతింది. మహాకూటమిగా ఏర్పడి 13 స్థానాల్లో టీడీపీ పోటీ చేసింది. రెండు స్థానాల్లో గెలిచింది.
తెలుగుదేశం విభజనకు పూర్వం తెలంగాణలోనూ బలమైన శక్తిగా ఉన్న పార్టి. బలమైన కార్యకర్తల బలంతోపాటుగా చెప్పుకోదగ్గ స్థాయిలో నేతలతో కళకళ లాడిని ఆ పార్టీ ప్రస్తుతం తెలంగాణలో తన ఉనికిని కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతోంది. 2014 ఎన్నికల్లో సైతం తెలంగాణలో 15 సీట్లను సాధిచడంతో పాటుగా దాదాపుగా 15శాతం ఓట్లను పొందిది. అయితే క్రమంగా పార్టీ పరిస్థితులు దిగజారాయి. ఎన్నికైన ఎమ్మెల్యేలు పార్టీని వదిలిపెట్టి వెళ్లిపోవడం మొదలు పెట్టారు. ఒకరిద్దరితో మొదలైన వలసలు ఆగకుండా సాగుతూనే ఉండడంతో పార్టీ కుదేలైంది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు పలికిన తెలంగాణ టీడీపీ రెండు స్థానాల్లో మాత్రమే గెల్చింది.
గెలిచిన రెండు స్థానాలూ ఖమ్మం జిల్లాలోనివే. సత్తుపల్లి నుంచి సండ్ర వెంకట వీరయ్య, అశ్వారావుపేట నుంచి మెచ్చా నాగేశ్వరావు గెలిచారు. అందులో ఒకరు ఇప్పటికే సైకిల్ వదిలి కారెక్కుతున్నారు. ఇక లోక్‌సభ ఎన్నికల విషయానికి వస్తే టీడీపీ అభ్యర్థులను నిలబెడుతుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 25న నామినేషన్ల దాఖలుకు ఆఖరి తేది. అయితే నామినేషన్ గడువు ముంచుకొస్తున్నా అభ్యర్థుల విషయంలో చర్చలు జరగడం లేదని తెలుస్తోంది. గెలుపుఓటముల సంగతి ఎలా ఉన్నా…పోటీ చేయాలనుకున్న వారికి ఆశలపై నీళ్లు చల్లినట్లుగా ఉందని అంటున్నారు. పార్టీలో నిరాశ, నిస్తేజం ఉండంతో అధినాయకత్వం కూడా అంతగా చొరవ తీసుకోవడం లేదని తెలిసింది. అందుకే పోటీ చేయాలా? వద్దా అన్న విషయం బయటపెట్టడం లేదు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఎపీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. అందుకే తెలంగాణ టీడీపీ నేతలకు అపాయింట్ మెంట్ దొరకడం లేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. నల్లగొండ , భువనగిరిలో పోటీ చేయడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా ఇప్పటికే చంద్రబాబుకు లేఖలు రాశారు. దీనికి చంద్రబాబు నుంచి ఎలాంటి సమాధానం రాలేదంటున్నారు. తెలంగాణలో టీడీపీ తప్ప అన్ని పార్టీల్లోనూ ఎన్నికల సందడి కనిపిస్తోంది. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, బీజేపీ అభ్యుర్థులను ప్రకటించాయి. ఒకప్పుడు నేతలు, కార్యకర్తలతో కళకళలాడే ఎన్టీఆర్ ట్రస్టు భవనం నిర్మానుష్యంగా మారింది. ఆశావాహుల హడావుడి కనిపించడమే లేదు. ఇలా ఉండగా ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్ దక్కలేదని, టీడీపీ రెండోస్థానంలో నిలిచిందని పార్టీ శ్రేణులు పేర్కొన్నారు. టీడీపీ లోక్‌సభ అభ్యర్థుల సంగతి త్వరగా తేల్చాలని నేతలు విజ్ఞప్తి చేశారు.

Wanna Share it with loved ones?