ఇదేనా బంగారు తెలంగాణ…

తెలంగాణ రాష్ట్ర ప్రజలు కలలు కన్న రాజ్యం ఇది కాదని పలువురు వక్తలు అభిప్రాయ పడ్డారు. సరూర్ నగర్ స్టేడియంలో జరుగుతున్న “కొలువులకై కొట్లాట ” సభలో ప్రసంగించిన పలువురు రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఎందరో త్యాగాలు చేస్తే వాటి పునాదులపై ఏర్పడ్డ తెలంగాణ మొత్తం తమ జాగీరు లాగా టీఆర్ఎస్ వ్యవహరిస్తోందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పటుకు కేవలం తామే కారకులమనే రీతిలో టీఆర్ఎస్ నేతలు ముఖ్యంగా కేసీఆర్ కుటుంబం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రస్తుతం రాచరిక పాలన నడుస్తున్నట్టు కనిపిస్తోందని విమర్శలను ఏమాత్రం సహించలేని స్థితికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకున్నారని ధ్వజమెత్తారు.
ప్రజాస్వామిక హక్కులను కాలరాసే విధంగా వ్యవహరిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. ఉద్యోగ ఖాళీలపై స్పష్టమైన ప్రకటన చేయకుండా తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతోందన్నారు. నిరుద్యోగ యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఉస్మానియా లో ఆత్యహత్య చేసుకున్న మురళిది ప్రభుత్వం చేసిన హత్యగా పలువురు అభివర్ణించారు. తెలంగాణ జేఏసీ తరపున సభను నిర్వహించుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని కోర్టు నుండి అనుమతి తెచ్చుకుని సభను ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చిందన్నారు.
జేఏసీ సభను అడ్డుకునేందుకు ప్రభుత్వం అన్నిరకాల ప్రయత్నాలు చేసిందని వారు మండిపడ్డారు. పోలీసుల సహాయంతో సభను పూర్తిగా నీరుగార్చేందుకు ప్రభుత్వం అన్ని చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయని అన్నారు. తెలంగాణ వస్తే కొలువులు వస్తాయని తెలంగాణ యువత పెట్టుకున్న ఆశలు మొత్తం నీరుగారి పోయాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కేసీఆర్ కుటుంబానికి తప్ప ఎవరికీ కొలువులు దక్కలేదన్నారు.
తెలంగాణ ద్రోహులను, ఉధ్యమకాలంలో తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని అందలం ఎక్కించిన కేసీఆర్ తెలంగాణ ప్రజలను వంచిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం తన విధానాలను మార్చుకోవాలని లేకుంటే ప్రజలే బుద్ది చెప్తారన్నారు.