సుష్మాస్వరాజ్ కన్నుమూత…

0
83
సుష్మస్వరాజ్ కన్నుమూత

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ కన్నుమూశాలు. తీవ్ర గుండెపోటుతో ఆమె చనిపోయారు. 67 సంవత్సరాల సుష్మ గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీనివల్లే ఆమె పార్లమెంటు ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు.
సుష్మాకు మంగళవారం రాత్రి గుండెపోటు రావటంతో కుటుంబ సభ్యులు దిల్లీలోని ఎయిమ్స్‌ కు తరలించారు. ఆ వెంటనే ఎమర్జెన్సీ వార్డుకు మార్చారు. చికిత్స అందిస్తుండగానే ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమెకు భర్త స్వరాజ్‌ కౌశల్‌, కుమార్తె బన్సురి ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటుగా పలువురు మంత్రులు, అన్ని పార్టీలకు చెందిన నేతలు సుష్మా స్వరాజ్ మృతికి సంతాపం తెలిపారు.
సుష్మా స్వరాజ్ మృతి దేశానికి తీరని లోటని పలువురు సంతాపం వెలిబిచ్చారు. తనదైన శైలిలో సుష్మ వాగ్దాటిని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు.
సుష్మ స్వస్థలం ప్రస్తుత హరియాణాలోని అంబాలా. హరిదేవ్‌ శర్మ, లక్ష్మీదేవి దంపతులకు ఆమె 1952 ఫిబ్రవరి 14న జన్మించారు. హరిదేవ్‌ ఆరెస్సెస్‌లో చాలా కీలకంగా పనిచేసేవారు. సుష్మ చదువుల్లో చురుకు. సంగీతం, లలిత కళలు, నాటకాలపై ఆసక్తి ఎక్కువ. సాహిత్యం, కవితలను విపరీతంగా చదివేవారు. అంబాలాలోని ఎస్‌.డి.కళాశాలలో బీఏ చదువుతున్నప్పుడు వరుసగా మూడేళ్లపాటు ఎన్‌సీసీలో ఉత్తమ క్యాడెట్‌గా ఎంపికయ్యారు
సుష్మ విద్యార్థిగా ఉన్నప్పుడే 1970ల్లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా ఆందోళనల్లో పాల్గొన్నారు. ఆపై జనతా పార్టీలో చేరారు. అత్యయిక స్థితికి వ్యతిరేకంగా విస్తృత ప్రచారం నిర్వహించారు. 1977లో తొలిసారిగా హరియాణాలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అదే ఏడాది కేవలం 25 ఏళ్ల వయసులో రాష్ట్ర కేబినెట్‌ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 1990 ఏప్రిల్‌లో రాజ్యసభ ఎంపీగా సుష్మ బాధ్యతలు చేపట్టారు. 1996లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1998లో దిల్లీలోని హాజ్‌ ఖాస్‌ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అదే ఏడాది అక్టోబరులో దిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దిల్లీ సీఎం పీఠమెక్కిన తొలి మహిళ ఆమే.
2000 సెప్టెంబర్‌ 30 నుంచి 2003 జనవరి 29 మధ్య కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రిగా పనిచేశారు. 2003 జనవరి 29 నుంచి 2004 మే 22 వరకు కేంద్ర ఆరోగ్యం – కుటుంబ సంక్షేమశాఖ మంత్రిగా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2009 జూన్‌ 3న లోక్‌సభలో ప్రతిపక్ష పార్టీ ఉప నేతగా బాధ్యతలు చేపట్టారు.. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి సుష్మ మనస్ఫూర్తిగా మద్దతిచ్చారు. 2009 నుంచి 2014 వరకు లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలిగా ఆమె వ్యవహరించడం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సానుకూలంగా మారింది.
తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టిన సమయంలో బిల్లుకు మద్దతు ప్రకటించారు. చిన్నమ్మగా తనను గుర్తుపెట్టుకోవాలంటూ నాడు ఆమె లోక్ సభలో అన్నారు.

Wanna Share it with loved ones?