నేరస్థులు ఎన్నికల్లో పోటీచేయకుండా అడ్డుకోలేం:సుప్రీం కోర్టు

నేర చరిత్ర ఉన్న అభ్యర్థుల వివరాలను ఆయా పార్టీలు తమ అధికారిక వెబ్ సైట్ లలో పొందుపర్చాలని, వారి వివరాలను ప్రజలకు బహిర్గతం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా తో కూడిన ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. నేరస్థులు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిలువరించాలంటూ దాఖలైన పిటీషన్ ను విచారించిన కోర్టు ఈ మేరకు తీర్పు చెప్పింది. అయితే నేర చరితులు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిలువరించలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీని కోసం పార్లమెంటులో చట్టాలు రూపొందించాల్సి ఉంటుందని, చట్టాలను కేవలం పార్లమెంటు మాత్రమే చేయగలదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
పార్టీ టికెట్ ను ఆశించే వ్యక్తులు ముందుగా తమ పై కేసులకు సంబంధించిన పూర్తి వివరాలను పార్టీకి అందచేయాలని కోర్టు స్పష్టం చేసింది. తమ ఓటు వేసే వ్యక్తులకు సంబంధించిన క్రిమినల్ కేసుల విశేషాలను గురించి తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల నేరచరిత్రకు సంబంధించిన వివరాలను వెల్లడించడం అనేది రాజకీయాల్లో నేరస్తులకు తావులేని విధంగా తీసుకునే చర్యల్లో ఒక ముందడుగుగా కోర్టు వ్యాఖ్యానించింది.
నేర చరిత్ర ఉన్న నాయకులు దేశానికి భారంగా మారారని, అటువంటి వారు అధికారంలో ఉండడం అంటే ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమేనని కోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది. అవినీతి, ఆర్థిక నేరాలు లాంటి ఆర్థిక తీవ్రవాదంగా కోర్టు అభిప్రాయపడింది. రాజకీయాల్లో వివిధ నేరాలతో సంబంధం ఉన్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.నేర చరిత్ర ఉన్న వారు చట్టసభలకు ఎంపిక కావడం పై పార్లమెంటు తగిన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

వరదలతో హిమాచల్ అతలాకుతలం