పార్లమెంటును మూసేస్తే ఇంటికెళ్లిపోతాం-మోడీపై సోనియా తీవ్ర వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు చాలా రోజుల తరువాత గళం విప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుని పడ్డారు. ఇండియా టుడే కాన్‌క్లేవ్‌ 2018లో సోనియా మాట్లాడారు. ప్రభుత్వం విపక్షాల గొంతు నొక్కుతోందని తీవ్ర స్వరంతో మండిపడ్డారు. పార్లమెంటు మూసేస్తే తామంతా ఇంటికి వెళ్లిపోతామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కూడా పార్లమెంటు కార్యకలాపాలు గౌరవంగా సాగాయని ఆమె చెప్పారు. వాజ్ పాయి ప్రధానిగా ఉన్న సమయంలో పార్లమెంటు కార్యక్రమాలు సజావుగా సాగాయని, విపక్షాలకు గౌరవం ఉండేదని మోడీ సర్కారులో అవి మచ్చుకైనా కనిపించడం లేదన్నారు. పార్లమెంటులో ప్రతిపక్షాలకు కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదని సోనియా మండిపడ్డారు.
బీజేపీ హయాంలో మత ఘర్షణలు ఎక్కువయ్యాయని ఆమె పేర్కొన్నారు. నాలుగు సంవత్సరాల కాలంలో మోడీ సర్కారు ప్రజలకోసం ఏమి చేసిందో చెప్పాలని సోనియా ప్రశ్నించారు. ప్రస్తుతం అన్ని రంగాలు సంక్షోభంలో కూరుకునిపోయి ఉన్నాయని సోనియా అన్నారు. కాంగ్రెస్ హయాంలో అవినితి జరిగిందంటూ మోడీ అబద్దాలను ప్రచారం చేస్తున్నారని సోనియా మండిపడ్డారు. ప్రజలకు, విపక్షాలకు కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వకుండా మోడీ సర్కారు పూర్తిగా ఏకపక్షనిర్ణయలు తీసుకుంటోందని సోనియా చెప్పారు.రానున్న రోజుల్లో తిరిగి అధికారంలోకి వచ్చేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నట్టు సోనియా వెల్లడించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందని సోనియా జోస్యం చెప్పారు. బీజేపీ పతనం ఈ రెండు రాష్ట్రాల నుండే ఆరంభం అవుతుందన్నారు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *