చితికిపోతున్న చిరు వ్యాపారులు-స్పెషల్ రిపోర్ట్

పేరు: రాజేష్
వృత్తి: కిరాణా దుకణం దారుడు
నోట్ల రద్దుకు ముందు ఆదాయం: రోజుకు వేయి రూపాయలు
నోట్ల రద్దు తరావాత ఆదాయం: రోజుకు వంద, రెండు వందలు
నోట్ల రద్దు చిరువ్యాపారుల పాలిట శాపంగా మారింది. ఒక్క రాజేష్ మాత్రమే కాదు చాలా మంది చిల్లర వ్యాపారుల పరిస్థితి దయనీయంగా మారింది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో “తెలంగాణ హెడ్ లైన్స్” ప్రతినిధులు చిరువ్యాపారులను కదిలిస్తే వారు తమ వ్యాపారం దారుణంగా పడిపోయిందని ఘొల్లుమంటున్నారు. నగరంలో పెద్ద దుకాణాలు, మాల్ మినహా చిల్లర దకాణాలు, వ్యాపారాలు కుటుంబ వ్యాపారాలుగా సాగుతాయి. ఇంటిల్లిపాది ఉదయం నుండి రాత్రి వరకు కష్టపడితే వచ్చే ఆదాయం అంతంత మాత్రమే. అసలు భారీ షాపింగ్ మాల్స్, ఆన్ లైన్ వ్యాపారాలు చిరువ్యాపారులు ఉసురు తీస్తే ఇప్పుడు నోట్ల రద్దుతో వీరి నెత్తిన పిడుగు పడ్డట్టు అయింది. నోట్ల రద్దు తరువాత తమ వ్యాపారం దారుణంగా పడిపోయిందని గతంతో పోలిస్తే ఇప్పుడు కనీసం పది శాతం కూడా అమ్మకాలు జరగడం లేదని దుకాణుదారులు వాపోతున్నారు.
నగదు కొరతతో అల్లాడుతున్న జనం కొనుగోళ్లు తగ్గించారని అడపాదడపా వచ్చే వారు సైతం డెబిట్, క్రెడిట్ కార్డులు తీసుకుని వస్తున్నారని తాము స్వైపింగ్ యంత్రాలను పెట్టుకునే స్థోమత తమకు లేదంటున్నారు. కేవలం  యంత్రాల కొనుగోలుతో పని పూర్తికాదు. స్వైపింగ్ యంత్రాలకు బ్యాంకు అకౌంట్లు కావాలని కరెంట్ అకౌంట్ తెరవాలంటే సవాలక్ష ప్రశ్నలతో విసిగిస్తున్నారని దుకాణుదారులు వాపోతున్నారు. మొబైల్ వ్యాలెట్ లు కూడా చాలా సార్లు మొరాయిస్తున్నాయని దుకాణుదారులు వాపోతున్నారు. చిన్న చిన్న దుకాణాల్లో ఇటువంటి సమస్యలు ఎక్కువగా ఉండడంతో వినియోగ దారులు మాల్స్ బాట పడుతున్నారు. కొంత మంది ఆన్ లైన్ లో కొనుగోళ్లు చేస్తున్నారు. దీనితో చిల్లర దుకాణాలు వినియోగదారులు లేక వెలవెల బోతున్నాయి.
చిల్లర దుకాణాల నిర్వహకుల్లో అధిక శాతం మంది పెద్దగా చదుకువుకోని వాళ్లే చాలా మంది వృద్దులు, మహిళలు దుకాణాల నిర్వహణ చూసుకునే వాళ్లే మారిన పరిస్థితుల్లో ఆన్ లైన్ లావాదేవీల పట్ల వారికి సరైన అవగాహన ఉండడం లేదు. సంవత్సరాల తరబడి నగదు లావాదేవీలకు అలవాటు పడిన వీరు ఇప్పుడు హఠాత్తుగా నగదు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనితో చిరు దుకాణాలకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. దీనిపైనే ఆధారపడి బతుకుతున్న వారు రోడ్డను పడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
చిరు వ్యాపారులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని పలువురు దుకాణుదారులు కోరుతున్నారు. బడా వ్యాపారుల చేతుల్లో చిరు వ్యాపారులు నలిగిపోకుండా రాష్ట్ర ప్రభుత్వం వీరి పై దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *