శబరిమలై లో ఆదివారం జరిగిన తొక్కిసలాటలో గాయపడిన వారి పరిస్థితి మెరుగ్గానే ఉందని ఆసుపత్రి వర్గాలు వెళ్లడించాయి. శబరిమలై ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాటలో మొత్తం 40 మందికి గాయాలు కాగా ఈ ప్రమాదంలో 17 మంది ఆంధ్రప్రదేశ్ కు చెందిన భక్తులు గాయపడ్డ సంగతి తెలిసిందే. ఇందులో తీవ్రంగా గాయాలు అయిన ఇద్దరిని కొట్టాయంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స జరిపిస్తున్నారు. వీరిలో ఒకరికి పట్టెటెముకలు విరగ్గా మరొకరి తలకు గాయం అయింది. వీరిద్దరి పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని ఆసుపత్రి వర్గాలు వెళ్లడించాయి. మరో ముగ్గురు పంబా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగతా వారికి స్వల్ప గాయాలే అయ్యాయని కేరళ ప్రభుత్వ అధికారులు వెళ్ళడించారు. గాయపడ్డవరిలో అనంతపురం, గుంటూరు జిల్లాలకు చెందిన వారు ఎక్కువగా ఉన్నారు.
శబరిమలలోని సన్నిధానం మలకప్పురం మధ్య తాడతో ఏర్పాటు చేసిన బ్యారికేడ్ తెగిపోవడంతో తోపులాట జరిగింది. ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు సన్నిధానం కు చేరుకున్నారు. మండలపూజలకు ఆఖరిరోజు కావడంతో పెద్ద సంఖ్యలో స్వాములు ఆదివారం దర్శనం కోసం సన్నిధానంకు చేరుకుంటున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. జరిగిన ఘటనను దృష్టిలో పెట్టుకుని మరింత పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు చెప్పారు.