సీతక్క మనసు మార్చింది ఎవరు…?

0
82

రేవంత్ రెడ్డితో పాటుగా తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యురాలు సీతక్క కాంగ్రెస్ పార్టీలో చేరడం ఇప్పుడు చర్చనీయాశంగా మారింది. సీతక్క పార్టీ మారే విషయం ఆఖరి నిమిషం వరకు ఆమె వెంట ఉన్న కార్యకర్తలకు కూడా తెలియకుండా జరిగిందనే ప్రచారం సాగుతోంది. రేవంత్ రెడ్డి వెంట కాంగ్రెస్ లోకి వచ్చే వారి జాబితా అంటూ కొన్ని పేర్లు ప్రచారం జరగ్గా అందులో సీతక్క పేరు కూడా ఉంది. అయితే తన పేరు బయటికి రావడం పై వివరణ ఇచ్చిన సీతక్క తాను తెలుగుదేశం పార్టీలోనే ఉంటానంటూ వివరణ కూడా ఇచ్చారు. పార్టీ మారే అవకాశాలు లేవంటూ సీతక్క ప్రకటించారు. తెలుగుదేశం పార్టీలో పొలిట్ బ్యూరో సభ్యురాలిగా ఉన్న తాను కాంగ్రెస్ లోకి వెళ్లనంటూ పేర్కొన్నప్పటికీ ఆఖస్మాత్తుగా ఢిల్లీలో ప్రత్యక్షం అయిన సీతక్క రేవంత్ వెంట కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోయారు. సీతక్క పార్టీ మారడం వెనుక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయని సమాచారం.
ములుగు మాజీ శాసనసభ్యురాలైన సీతక్క అసలు పేరు డి.అనసూయ. చాలా కాలం పాటు నక్సల్ ఉధ్యమంలో చురుగ్గా పాల్గొన్న ఆమె సీతక్కగా సుపరిచితురాలు. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా ఉన్న ఆమె రేవంత్ రెడ్డి సన్నిహితురాలైన చురుకైన నేతగా పేరు పొందినప్పటికీ రేవంత్ వెంట ఆమె కాంగ్రెస్ లోకి వెళ్ళరనే ప్రచారం బలంగా వినిపించింది. స్థానిక పరిస్థితుల నేపధ్యంలో కూడా సీతక్క కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు ఆశక్తి చూపించడంలేదనే ప్రచారం సాగినా అనూహ్యంగా ఆమె కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. డోలాయమానంలో ఉన్న సీతక్కను తమ వైపుకు తిప్పుకోవడం కోసం రేవంత్ రెడ్డి తన భార్యను రంగంలోకి దింపారనే ప్రచారం కూడా జరుగుతోంది. రేవంత్ రెడ్డి భార్య స్వయంగా సీతక్కను తీసుకుని హైదరాబాద్ కు వచ్చారని అక్కడి నుండి ఆమె విమానంలో ఢిల్లీకి ప్రయాణం అయ్యారనే వార్తలు కూడా వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ నుండి ఒత్తిడులు తీవ్రం కావడంతో పార్టీలోనే ఉండాలనే ఒక దశలో నిర్ణయించుకున్నప్పటికీ రేవంత్ రెడ్డి భార్య గీతారెడ్డి స్వయంగా సీతక్కను కలుసుకుని నచ్చచెప్పినట్టు ప్రచారం జరుగుతోంది.
ఇటీవల సీతక్క కుమారుడి వివాహానికి సైతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వచ్చి వెళ్ళారు. పార్టీలో సీతక్కకు మంచి పేరుతో పాటుగా బాబు వద్ద పలుకుబడి కూడా ఉందని ఇటువంటి క్రమంలో పార్టీని విడిచివెళ్లడం పై టీడీపీ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. సీతక్క పార్టీ మారుతున్నట్టుగా ఆఖరి నిమిషం వరకు ఆమె అనుచరులకు కూడా సమాచారం లేకుండా పోయింది. ఎటూ తేల్చూకోలేని స్థితిలో ఉన్న సీతక్కను పక్కా పథకం ప్రకారం తన భార్యను పంపడం ద్వారా రేవంత్ తన వైపు మళ్లించుకున్నారని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here