అమ్మాయిల బాత్రూంలలో రహస్య కెమేరాలు

విద్యార్థినుల బాత్రూంలలో రహస్య కెమేరాలను పెట్టి అందులో రికార్డయిన దృశ్యాలను ఇంటర్నెట్ సైట్ లలో ఉంచుతున్న ఇంజనీరింగ్ విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులోని పరప్పన అగ్రహార పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలు ఇట్లా ఉన్నాయి. తమిళనాడుకు చెందిన సిద్ధార్థ (21) చూడసంద్ర వద్ద ఉన్న ఓ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. స్థానికంగా హాస్టల్ లో ఉంటున్న ఈ విద్యార్థి సమీపంలోని లేడీస్ హాస్టల్ లోని బాత్ రూంలలో రహస్య కెమేరాలను పెట్టించాడు. వాటిల్లోని దృశ్యాలను నెట్ లో ఉంచడంతో పాటుగా అందులో ఉన్న విద్యార్థినులను బెదిరించి లొంగదీసుకున్నాడని పోలీసులు చెప్తున్నారు.
ఇదే హాస్టల్ లో ఉంటున్న ఓ విద్యార్థినికి ప్రేమ పేరుతో దగ్గరయ్యాడని ఆమెను హోటల్ రూంకు తీసుకుని వెళ్లిన సిద్ధార్థ తనతో ఏకాంతంగా గడిపిన దృశ్యాలను మొబైల్ ఫోన్ లో రికార్డు చేశాడు. వాటిని చూపి ఆమెను బెదిరించి విద్యార్థినుల హాస్టల్ బాత్రూంలలో కెమేరాలను పెట్టించినట్టు పోలీసులు తెలిపారు. తన నగ్న దృశ్యాలను చూపించి సిద్ధార్థ వేధించడంతో ధైర్యం చేసిన ఓ అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతగాడి బండారం మొత్తం బయటపడింది. బాత్రూంలలో రహస్య కెమేరాలను అమర్చడంలో సహకరించిన యువతిని కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. తనను బెదిరించడంతో అతను చెప్పినట్టు చేసినట్టు సదరు యువతి పోలీసుల వద్ద వాపోయింది.
బాత్రూంలలో కెమేరాలను పెట్టడానికి ఒక్క అమ్మాయే సహకరించిందా లేక మరెవరైనా ఉన్నారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వాడి మొబైల్ ఫోన్ తో పాటుగా ల్యాప్ టాప్ ను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఎంత మంది అమ్మాయిలకు సంబంధించిన దృశ్యాలు ఉన్నాయి వాటిని ఏయే సైట్ లలో అప్ లోడ్ చేశారో పోలీసులు ఆరాతీస్తున్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నామని ఈ కేసుతో ఇంకెవరికైనా సంబంధాలు ఉన్నాయేమోనని ఆరా తీస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

కమలం నేతలకు ముందస్తు గుబులు


తెలంగాణలో కొత్త జోన్లు ఇవే | new zones in telangana