సీఎం కుర్చీ వైపు చిన్నమ్మ అడుగులు

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టడం ద్వారా జయలలితకు నిజమైన రాజకీయ వారసురాలిన తానేనని జయలలిత సన్నిహితురాలు శశికళ ప్రపంచానికి చాటారు. అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశంలో శశికళను సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నుకునేట్లు చేయడం ద్వారా తన రాజకీయ చతురతును ప్రధర్శించిన శశికళ తదుపరి లక్ష్యం ముఖ్యమంత్రి పీఠమేనా అంటే తమిళ రాయకీయ వర్గాలు అవుననే అంటున్నాయి. వాస్తవానికి జయలలిత మరణం తరువాత సీఎం పీఠం మీద శశికళను కూర్చో పెట్టాలని కొంతమంది అన్నాడీఎంకే నేతలు భావించినప్పటికీ శశికళ వారిని వారించినట్టు సమచారం. జయ మరణించిన వెంటనే ఆ పీఠాన్ని ఎక్కితే ప్రజల్లోనూ, పార్టీ కార్యకర్తల్లోనూ తప్పుడు సంకేతాలు పోతాయనే భయంతో శశికళ వెంటనే పదవిని చేపట్టడానికి ఒప్పుకోలేదు. జయకు అత్యంత విధేయుడు, తాత్కాలిక ముఖ్యమంత్రి అన్న పేరును పొందిన పన్నీరు సెల్వంను అధికార పీఠం పై ఉంచారు. సీఎం పన్నీరు సెల్వం అయినా అధికార గణం అంతా చిన్నమ్మ చెప్పుచేతల్లోనే ఉంది. కనీసం అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశానికి హాజరు కాకుండానే ప్రధాన కార్యదర్శిగా తనను ఎన్నుకునేటట్టు వ్యూహాలు రచించిన చిన్నమ్మ ఇప్పటి వరకు పార్టీలోనూ, ఇటు ప్రభుత్వ పరంగా ఎటువంటి పదవులు నిర్వహించలేదు. తెరవెనుకే ఉండిపోయిన చిన్నమ్మ ఇక తెరముందుకు రాబోతున్నారు.
జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్.కె.నగర్ ఉప ఎన్నికలో శశికళ పోటీచేయడం ఖాయం అయిపోయింది. ఉప ఎన్నికలో పోటీ చేయడం ద్వారా జయలలిత రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుని పార్టీలో పాగా వేసిన శశికళ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టడం ఖాయమని అంటున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో జయతో పాటుగా నిందితురాలిగా ఉన్న శశికళకు సీఎం పదవిని చేపట్టడానికి ఈ కేసులు పెద్ద అడ్డంకికాబోని అంటున్నారు. పన్నీరు సెల్వంను అడ్డుపెట్టుకుని తమిళనాడులో చక్రం తిప్పాలని భావించిన బీజేపీకి శశికళ గట్టిగానే షాక్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటుగా శశికళకు చెందిన సినీ ఫైనాన్స్ సంస్థలపై జరిగిన ఐటి దాడులతో శశికళను తమ దారికి తెచ్చుకోవాలని భావించిన బీజేపీ ఆశలు తీరలేదు. శశికళ అంత త్వరగా దారికి వచ్చే ఘఠం కాదని తేలిపోవడంతో పాటుగా శశికళను దిక్కరించే సాహసం ప్రస్తుతానికి పన్నీరు సెల్వం చేేసే స్థితిలో లేడని తేలిపోవడంతో బీజేపీ తన ఆశలు వదులుకున్నట్టుగానే కనిపిస్తోంది.
ఇప్పటివరకు జయ వెనుక ఉండి తమిళరాజకీయాల్లో చక్రం తిప్పిన శశికళకు ప్రత్యక్ష రాజకీయాల్లో పెద్దగా అనుభవం లేదు. దీనితో పాటుగా రాష్ట్రంలో బలంగా ఉన్న ప్రతిపక్షం అదనుకోసం కాచుకుని కూర్చుంది. ఇటు పార్టీలోని ప్రత్యర్థులు కూడా అదనుకోసం కాపుకాచి ఉన్నారు. ఈ పరిస్థితుల్లో సీఎం పదవిని చేపట్టినా చిన్నమ్మ సవాళ్లను ఎంతమేరకు ఎదుర్కొగలదో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *