అన్నాడీఎంకే నుండి శశికళకు ఉధ్వాసన

0
46

అన్నాడీఎంకే పార్టీలో అన్నీ తానై మొన్నటిదాకా చక్రం తిప్పిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళను పార్టీ నుండి బహిష్కరించారు. తన కనుచూపుతో పార్టీని నడిపించిన శశికళకు ఇప్పుడు పార్టీలో కనీసం చోటు కూడా దక్కని పరిస్థితి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగళూరు జైలులో ఉన్న శశికళతో పాటుగా ఆమె సమీప బంధువు దినకరన్ ను కూడా అన్నాడీఎంకే నుండి బహిష్కరిస్తున్నట్టు సోమవారం సమావేశమైన పార్టీ కార్యవర్గం నిర్ణయం తీసుకుంది. జయలలిత మరణం తరువాత పార్టీని అన్నీ తానై నడిపించిన శశికళ పై ఇప్పుడు వేటు పడింది. అన్నా డీఎంకే పార్టీ శశికళ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా నిట్టనిలువునా చీలిన తరువాత అనేక నాటకీయ పరిణామాల తరువాత పార్టీలోని వైరి వర్గాలుగా పేరు పడ్డ పళని స్వామి , పన్నీరు సెల్వం వర్గాలు ఒక్కటయ్యాయి. వీరి మైత్రికి సూచనగా పన్నీరు సెల్వం ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. శశికళను పార్టీ నుండి బహిష్కరించాలనే ఒప్పందం పైనే రెండు వర్గాలు ఒక్కటైనట్టు ప్రచారం సాగింది. ఈ మేరకే ఆమెను పార్టీ నుండి సాగనంపుతూ నిర్ణయం తీసుకున్నారు.
శశికళను పార్టీ నుండి బహిష్కరించడంతో పాటుగా ఆమె ఆధీనంలోనుండి పార్టీని పూర్తిగా బయటకు తీసుకుని వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు శశికళ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. జయలలిత మరణం తరువాత ఖాళీ అయిన పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టిన శశికళ అటు తర్వాత ముఖ్యమంత్రి పదవిని ఆశించి భంగపడిన సంగతి తెలిసిందే. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు పాలు కావడంతో తనకు నమ్మకంగా ఉన్న పళని స్వామికి ప్రభుత్వ బాధ్యతలు, సమీప బంధువు దినకరన్ కు పార్టీ బాధ్యతలు అప్పగించిన శశికళ జైలు నుండే చక్రం తిప్పాలని చేపిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. ఇప్పుడు ఆమె ఏకంగా పార్టీకే దూరంకావాల్సి వచ్చింది. శశికళ చేతుల్లో ఉన్న పార్టీ ఛానల్ జయటీవీతో పాటుగా నమదు ఏంజీర్ పత్రికల్లోనూ శశికళ చేతుల్లోనుండి బయటకు తీసుకుని వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ తీసుకున్న ఏ నిర్ణయం కూడా ఇక పై చెల్లుబాటు కాదని అన్నా డీఎంకే వర్గాలు వెల్లడించాయి.
శశికళ కను సైగల్లో పనిచేసిన నేతలే ఇప్పుడు ఆమెపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. చిన్నమ్మగా జయలలితకు సమానంగా గౌరవాన్ని అందుకున్న శశికళను పార్టీ వర్గాలు ఈసడించుకుంటున్నాయి. జయలలిత వారసురాలిగా తనని తాను ప్రకటించుకున్న శశికళ పరిస్థితి ఇప్పుడు దారుణంగా తయారైంది. అయితే అనిశ్చిత రాజకీయాలకు పెట్టింది పేరైన తమిళనాడులో రానున్న కాలంలో రాజకీయాలు ఏ మలుపు తిరగనున్నాయో చూడాలి.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here