మళ్లీ గర్జిస్తున్న రష్యా…!

ఒకప్పుడు అమెరికాతో సమానంగా ప్రంపంచ రాజకీయాలను శాసించిన రష్యా మళ్లీ తన పూర్వ వైభవాన్ని సంపాదించుకునే పనిలో పడింది. అమెరికాకు అన్నిరంగాల్లో ధీటుగా ఉన్న సోవియట్ యూనియన్ పతనం తరువాత రష్యా అన్ని రంగాల్లో పూర్తిగా దెబ్బతినింది. ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతిన్న రష్యా ప్రపంచ రాజకీయాల్లో తన అస్థిత్వాన్ని కోల్పోయింది. దేశంలో ప్రజలు తిండికి అల్లాడుతుంటే ఇతర దేశాల రాజకీయాల్లో జోఖ్యం చేసుకునే ఆలోచన కూడా రష్యాకు లేకుండా పోయింది. దీనితో ప్రపంచానికి ఏకైక అగ్రరాజ్యంగా అవతరించిన అమెరికా ఆడిందిఆట పాడింది పాట అన్నట్టుగా మారిపోయింది. ఆర్థికంగా క్రమంగా కోలుకుంటూ వచ్చిన రష్యా ఇప్పుడు ప్రపంచ రాజకీయాల్లో తన మునుపటి ధూకుడును ప్రదర్శిస్తోంది. అమెరికాకు ధీటుగా తన అస్తిత్వాన్ని చాటుకుంటోంది. ఆర్థికంగా బలపడుతున్న రష్యా తనకున్న అపార రక్షణ పాటవాన్ని మరింత మెరుగుపర్చుకుంటోంది. ప్రపంచ రాజకీయాల్లో రష్యా ఇటీవల సోవియట్ పతనం తరువాత ఎన్నడూ లేని దూకుడును ప్రదర్శిస్తోంది.
ప్రపంచంలోని అన్ని దేశాల అంతర్గత రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం తనకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అమెరికాకు వెన్నతో పెట్టిన విద్య. ఈ విద్యను బాగా వంటపట్టించుకున్న రష్యా ఏకంగా అగ్రరాజ్యం అమెరికా రాజకీయాల్లోనే జోక్యం చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు రష్యా మద్దతు పలికిందని ఆయనకు అనుకూలంగా లాబీయింగ్ చేయడం ద్వారా ట్రంప్ ఎన్నికల్లో గెల్చేందుకు అన్నిరకాలుగా సహాయ సహకారాలు అందించిందనేది బహిరంగ రహస్యమే. అమెరికా రాజకీయాల్లోనే వేలుపెట్టి విజయం సాధించిన రష్యా ఇప్పుడు ఫ్రాన్స్ రాజకీయాల్లోనూ తలదూరుస్తోంది. అక్కడి మితవాత అభ్యర్థితో రష్యా అధినేత పుతిన్ మంతనాలు జరపడం సంచలనంగా మారింది. ఫ్రాన్స్ లోనూ తనకు అనుకూలంగా ఉండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించే దిశగా రష్యా పావులు కదుపుతున్నట్టు కనిపిస్తోంది. వీటితో పాటుగా ప్రంపంచ రాజకీయాల్లో రష్యా గతానికి భిన్నంగా వ్యవహరిస్తూ కొత్త మిత్రులతో అడుగులు వేస్తోంది. పొరుగున ఉన్న చైనాతో మైత్రికి నాందిపలకడం ఏకంగా ఆదేశంతో కలిసి సైనిక విన్యాసాలు నిర్వహించడం అంతర్జాతీయ రాజకీయాల్లో పెద్ద సంచలనంగానే చెప్పుకోవచ్చు. పొరుగున ఉన్న చైనాతో రష్యాకు మొదటి నుండి అంతగా సఖ్యత లేదు. రకరకాల కారణాల వల్ల చైనాను రష్యా దూరం పెడుతూనే ఉంది. రష్యాలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ప్రపంచ కమ్యూనిస్టులందరికీ తానే పెద్దన్నగా ఉండడానికి ఇష్టపడిన రష్యా సోదర కమ్యూనిస్టు దేశం చైనా దూరంగానే ఉంచింది. ఇందుకు సైద్దాంతిక కారణాలు ఒకటైతే చైనా తన స్థానాన్ని ఎక్కడ ఆక్రమిస్తుందోననే భయం మరొకవైపు చైనా రష్యాలు దూరంగానే ఉండిపోయాయి. అయితే మారిన పరిస్థితుల్లో చైనాతో  సఖ్యతను పెంచుకున్న రష్యా తన ప్రాభల్యాన్ని విస్తరించుకునే క్రమంలో శతృవులతోనూ దోస్తీకి సిద్దం అయింది.
సైనిక పరంగా రష్యా శక్తిని ఎవరూ తక్కువ అంచానా వేయలేరు. సోవియట్ యూనియన్ కాలం నుండి అపార సైనిక శక్తి సమకూర్చుకున్న రష్యా అమెరికాకు ధీటుకు ఎదిగింది. సోవియట్ పతనం తరువాత కూడా రష్యా తనకు వారసత్వంగా సంక్రమించిన అపార రక్షణ సామర్థాన్ని కాపాడుకుంటూ ప్రపంచంలోనే రక్షణ రంగంలో తిరుగులేని శక్తిగా ఉంది. సిరియా పోరాటంలో అమెరికాకు వ్యతిరేకంగా వ్యవహరించిన రష్యా భారీగా తన సైనిక దళాలను రంగంలోకి దింపి సిరియా పోరాటాన్ని పతాక స్థాయికి తీసుకుని పోయింది. ఇటీవల కాలంలో తన సైనిక కార్యకలాపాలను, రక్షణ సామర్థ్యాన్ని రష్యా విపరీతంగా పెంచుకుంటూ పోతోంది. ప్రపంచ రాజకీయాల్లో దూకుడుగా వ్యవహరిస్తూ సైనిక బలగాల మోహరింపు ద్వారా ఇతర దేశాలను దారికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రపంచ దేశాల అభ్యంతరాలను పెడచెవిన పెట్టి యుక్రేయిన్ ను తన సైనిక బలం ద్వారా లొంగదీసుకుంది. ప్రచ్చన్న యుద్ధం తరువాత ఎన్నడూ లేనంతగా యూరప్ లో సైనిక మోహరింపులతో తిరిగి ప్రపంచ రాజకీయాల్లో తన ముద్రను బలంగా వేస్తున్న రష్యా తన చేజారి పోయిన అగ్రరాజ్యం హోదాను తిరిగి పొందే ప్రయత్నం చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *