దేశవ్యాప్తంగా రహదారులకు మహర్థశ పట్టనుంది. గతంలో ఎన్నడూ చేపట్టని విధంగా 83వేల కిలోమీటర్ల మేరకు హైవే పనులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మంగళవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. మౌళిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో హైవేలను అభివృద్ధి చేయనున్నారు. ఇవి 83వేల కిలోమీటర్లు ఉండనుంది. దీనికోసం గాను రానున్న ఐదు సంవత్సరాల్లో 6.9 లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నారు. మరో వైపు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెపట్టిన ‘భారత్ మాల’ ప్రాజెక్టులో భాగంగా మొదటి విడతగా 3.5 లక్షల కోట్ల రూపాయల వ్యయంతో 40వేల కిలోమీటర్ల మేర రహదారులను అభివృద్ది పర్చనున్నారు.
ఈ మేగా ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇంత పెద్ద మొత్తంలో రహదారుల కోసం ఖర్చుచేయడం ఇదే మొదటిసారని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. మౌళిక వసతులను మెరుగుపర్చడం వల్లే దేశ అభివృద్ది సాధ్యం అవుతుందని భావిస్తున్న కేంద్ర సర్కారు ఈ మేరకు రహదారుల అభివృద్ధి కోసం నడుం కట్టింది.