రేవంత్ ను చేర్చుకోవద్దు-ఆధిష్టానం పై కీలక నేతల ఒత్తిడి

తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చేరడం ఇక లాంఛనప్రాయమే అనే ప్రచారం జరుగుతుండగా మరో వైపు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరకుండా ఉండేందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని ఓ కీలక నేత తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డిని పార్టీలోకి తీసుకుని రావడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతుందని ఆయన పార్టీ హై కమాండ్ కు చెప్పినట్టు సమాచారం. దూకుడుగా వ్యవహరించే మనస్తత్వం ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రాజకీయాలకు ఏ మాత్రం సరిపోడనేది ఆయన వాదన. ఓటుకు నోటు వ్యవహారంలో పూర్తిగా బద్నాం అయిన రేవంత్ రెడ్డిని పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా ఒరిగేది ఏదీ లేదని దీనిపై కాంగ్రెస్ పార్టీ పెద్దలకు విషయాన్ని విరించే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం.
కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి షరతులు పెడుతున్న రేవంత్ రెడ్డి పార్టీలోకి వచ్చిన తరువాత ఇతర నేతలతో సరిగా వ్యవహరించే అవకాశం లేదని అంటున్న సదరు నేతలు ముందుగానే రేవంత్ రెడ్డి రాకుండా అడ్డుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నట్టు కనిపిస్తోంది. రేవంత్ రాక వల్ల తమ ప్రాభవం తగ్గుతుందనే అనుమానం కూడా ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. కేవలం కేసీఆర్ వ్యతిరేకతతో రేవంత్ ను పార్టీలోకి చేర్చుకోవడం ఎంత మాత్రం సమంజసం కాదని అంటున్న సదరు నేతలు తమ అభిప్రాయాలను పార్టీ అధిష్టానం వద్ద గట్టిగానే వినిపించినట్టు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *