వర్మకి దిమ్మతిరుగుతోంది

రాంగోపాల్ వర్మ సినిమా దర్శకుడిగా కన్నా వివాదాస్పద వ్యక్తిగా ఎక్కువగా పేరు సంపాదించుకున్నాడు. ఇంటర్వ్యూలలో తిక్కతిక్క సమాధానాలు ఇవ్వడంతో పాటుగా ఎవరికీ భయపడనంటూ చెప్పుకునే రాంగోపాల్ వర్మకు ఇప్పుడు ఇబ్బందులు తప్పడం లేదు. వివాద్సపద చిత్రాలు తీయండంలో పేరు పొందిన వర్మకు జీఎస్టీ (గాడ్ సెక్స్ ట్రూత్ ) సినిమాతో మాత్రం ఇబ్బందులు తప్పడంలేదు. ఈ చిత్రానికి సంబంధించి ఒక టీవీ స్టూడియోలు చేసిన వ్యాఖ్యలు వర్మ మెడకు చుట్టుకున్నాయి. తన సినిమాను సమర్థించుకునే క్రమంలో చర్చలో పాల్గొన్న మహిళలను ఉద్దేశించి వర్మ చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్ లో ఇప్పటికే కేసులు నమోదు కాగా అటు విశాఖపట్నంలోనూ ఆయనపై పోలీసులు కేసు పెట్టారు.
టీవీ చర్చ సందర్బంగా సామాజిక కార్యకర్త దేవితో పాటుగా మరికొంత మందితో మాట్లాడిన వర్మ మీతోను నగ్నంగా సినిమా తీస్తానంటూ చేసిన వ్యాఖ్యలపై పోలీసు కేసు నమోదయింది. ఇప్పటికే సీసీఎస్ పోలీసులు వర్మను ఒకసారి విచారించి ఆయన ల్యాప్ టాప్ ను స్వాధినం చేసుకున్నారు. విచారణ సందర్భంగా వర్మ తాను జీఎస్టీ సినిమాకు దర్శకత్వం వహించలేదని కేవలం స్కైప్ లో కొన్ని సూచనలు చేసినట్టు మాత్రమే చెప్పుకోవడం గమనార్హం.
ఇప్పటికే ఈ కేసులో వర్మను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తుండగా అదే సమయంలో విశాఖపట్నంలోని ఆయనపై కేసులు నమోదయ్యాయి. విచారణకు హాజరు కావాల్సిందిగా ఇప్పటికే విశాఖ పోలీసులు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. కేసులతో వర్మ ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టు తెలుస్తోంది. వర్మ వ్యాఖ్యలు శృతిమించి ఉన్నట్టు తేలడంతో అరెస్టుకు దారితీసే అవకాశాలు కనిపిస్తుండడంతో వర్మ ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాడు. అందులో భాగంగానే జీఎస్టీ సినిమాను తాను తీయలేదని చెప్పడంతో పాటుగా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్టు కూడా ప్రకటించాడు.
గతంలో ట్విట్టర్ లో చేసిన కొన్ని కామెంట్లను కూడా వర్మ క్రమంగా తొలగిస్తున్నట్టు తెలుస్తోంది. న్యాయవాదుల సలహామేరకు ఇప్పటికే వర్మ ట్విట్టర్ లోని కొన్ని వ్యాఖ్యలను తొలగించినట్టు సమాచారం. మొత్తం మీద రాంగోపాల్ వర్మ మెడకు జీఎస్టీ వ్యవహారం గట్టిగానే చుట్టుకుంది.