నరకాన్ని చూపిస్తున్న వర్షాలు…

భారీ వర్షాలు నగర ప్రజలకు నరకాన్ని చూపెడుతున్నాయి. విపరీతంగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. వర్షాలకు హైదరాబాద్ మహానగరంలోని రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. గుంటల్లో నీళ్లు నిలబడడంతో వర్షం పడుతున్న సమయంలో ప్రయాణం అంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తోంది. కొద్ది రోజులుగా నగరంలో కురుస్తున్న భారీ వర్షాలు బెంబేలెత్తిస్తున్నాయి. నగరంలోని చెరువులు, కుంటలు పూర్తిగా నిండిపోగా నాలాలు పొంగిపొర్లుతున్నాయి. ఏ మాత్రం వర్షం పడినా నాలాలు పొంగుతూ రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడంతో పాటుగా ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోతున్నాయి. వర్షం కోసం ప్రార్థించిన నగర ప్రజలు ఇప్పుడు ఆ పేరు చెప్తేనే బెంబేలెత్తున్నారు.
వర్షాల దెబ్బకు అనేక లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. ఇళ్లలోకి నీళ్లు చేరుతున్నాయి. అపార్ట్ మెంట్లలోని సెల్లార్లు మునిగిపోతున్నాయి. వాహనాలు పనికిరాకుండా పోతున్నాయి.ఇక డ్రైనేజీల పరిస్థితి చెప్పాల్సిన అవసరమే లేదు. అసాధారణంగా కురుస్తున్న వర్షాలతో వస్తున్న సమస్యలు అధికమించడం జీహెచ్ఎంసీ కీ కూడా తలకుమించిన బారంగానే తయారయింది.