భారీ వర్షాలకు తమిళనాడు రాజధాని చెన్నై మరోసారి విలవిల్లాడుతోంది. కొద్ది రోజులుగా చెన్నైలో కురుస్తున్న భారీ వర్షాలకు నగరంలోని అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లన్నీ చిన్నసైజు నదులుగా మారాయి. చాలా చోట్ల మోకాలి లోతు మేర నీళ్లు నిల్చిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గురువారం నాడు దాదాపు ఐదు గంటల పాటు చెన్నైలో వర్షం కురిసింది. గత కొద్ది రోజులుగా ఈశాన్య రుతుపవనాల వల్ల వర్షాలు కురుస్తున్నా మరో సారి పడిన భార్షానికి సాధారణ జనజీవనం అతలాకుతలం అయింది. ఇళ్లలోకి నీళ్లు రావడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చెన్నై శివారు ప్రాంతాల్లో వర్షం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై నీళ్లు నిల్చిపోవడంతో ఇళ్ల నుండి బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
వర్షాల వల్ల స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. పలు ప్రైవేటు కార్యాలయాలు కూడా మూత పడ్డాయి. దుకాణాలు, వాణిజ్య సముదాయాలు కూడా పూర్తిగా తెరుచుకోలేదు. కొన్ని ఐటి సంస్థలు కూడా తమ సిబ్బందికి సెలవు ప్రకటించాయి. వర్షం వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం సహాయక శిభిరాలను ఏర్పాటు చేసింది. మరో రెండు రోజులు కూడా చెన్నైలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ చేసిన హెచ్చరిక ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.