ఈశాన్య రాష్ట్రాల ప్రజల మనసును తిరిగి గెల్చుకునేందుకు శాయశక్తులా కృషిచేస్తామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఆయన స్పందించారు. ప్రజల నమ్మకాన్ని తాము పొందలేకపోయామని చెప్పిన ఆయన వారి మనసులను తిరిగి గెల్చుకునేందుకు శాయశక్తుల కృషిచేస్తామన్నారు. దీని కోసం గాను కష్టపడి పనిచేస్తామని రాహుల్ పేర్కొన్నారు. ప్రజల తీర్పును తాము గౌరవిస్తామని ఆయన అన్నారు. దెబ్బతిన్న చోట తిరిగి పుంజుకునే ప్రయత్నాలు చేస్తామన్నారు. మేఘాలయలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 21 స్థానాలు మాత్రమే గెల్చుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటు చేసే బలం లేకపోవడంతో నేషనల్ పీపుల్స్ పార్టీ బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. త్రిపుర, నాగా లాండ్ లలో కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానాన్ని కూడా గెల్చుకోలేపోయింది.