పెదతోవ పట్టిన విద్యార్థిని మందలించడమే ఆ గురువు పాలిట శాపంగా మారింది. పాఠశాలలో అందరితోనూ గొడవలు పడుతున్న విద్యార్థిని మందలించిన ప్రిన్సిపాల్ ను హత్యచేశాడో విద్యార్థి. ఈ దారుణ ఘటన హర్యానాలో జరిగింది. రాష్ట్రంలోని యమునానగర్ కు చెందిన ఓ పాఠశాలలో 12వ తరగతి చదువుతున్న విద్యార్థి పాఠాశలలో అందరితోనూ గొడవలకు దిగుతున్నాడు. దీనితో అతని హాజరు శాతం చాలా తక్కువగా ఉంది. విద్యార్థి ప్రవర్తన సరిగా లేకపోవడంతో పాటుగా పాఠశాలకు సరిగా రాకపోవడంతో సదరు విద్యార్థిని మందలించిన ప్రిన్సిపల్ పై కక్షపెంచుకున్న అతను తన తండ్రి తుపాకీ తీసుకుని పాఠశాలకు వచ్చాడు. ప్రిన్సిపల్ తో మాట్లాడాల్సిన పనిఉందంటూ ఆమె గదిలోకి వెళ్లిన విద్యార్థి ప్రిన్సిపల్ పై కాల్పులు జరిపాడు. దీనితో బులెట్ గాయాలతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
కాల్పుల శబ్దానికి ప్రిన్సిపల్ గదిలోకి వచ్చిన సిబ్బందికి ఆమె రక్తం మడుగులో కనిపించారు. సమీపంలోనే తుపాకీతో ఉన్న నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.