ప్రగతి నివేదన సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి

తెలంగాణ రాష్ట్రసమితి ప్రతిష్టాత్మంగా నిర్వహిస్తున్న ప్రగతి నివేదన సభకు సర్వం సిద్ధమైంది. సెప్టెంబర్ 2 ఆదివారం సాయంత్రం జరిగే సభకు శనివారం రాత్రి నుండే కార్యకర్తల రాక మొదలయింది. దూర ప్రాంతాలన నుండి వచ్చేవారు కొంత మంది శనివారం రాత్రికే సభా ప్రాంగణానికి చేరుకోగా మరికొందరు ఆదివారం ఉందయం సభ జరుగనున్నప్రాంతానికి చేరుకున్నారు. హైదరాబాద్ నగర శివార్లలోని కొంగర్ కలాన్ లో సభను నిర్వహిస్తున్నట్టు ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించిన వెంటనే అఘామేఘాల మీద భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 25 లక్షల మందితో భారీ బహిరంగ సభను నిర్వహించాలని అధికార టీఆర్ఎస్ భావిస్తుండడంతో దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు జరిగిపోయాయి.సభకు పెద్దఎత్తున ట్రాక్టర్లలో రైతులను తరలించాలన్న కేసీఆర్‌ పిలుపు మేరకు 12 వేల ట్రాక్టర్లు సభకు పయనమయ్యాయి.
ఈ సభలో కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశాలున్నాయి. ప్రస్తుత రాజీకయ పరిణామాల నేపధ్యంలో తెలంగాణతో పాటుగా దేశవ్యాప్తంగా ప్రగతి నివేదన సభపై ఆశక్తి నెలకొంది.
మరోవైపు శనివారం రాత్రి కురిసిన భారీ వర్షం టీఆర్ఎస్ శ్రేణులను కలవరపెట్టింది. ఈదురుగాలులతో పెద్ద వర్షం పడడంతో సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కటౌట్లు కూలిపోయాయి. పార్కింగ్ ప్రదేశం చిత్తడిగా మారింది. వర్షం పడ్డా ఇబ్బందులు తలెత్తకుండా టెంట్లు ఏర్పాటు చేయడంతో ప్రాగణంలో ఏర్పాట్లు చేస్తున్న కార్యకర్తలు, కార్మికులు వాటి కిందకు చేరుకున్నారు. భారీ వర్షం ఆగిపోవడంతో టీఆర్ఎస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి.