శ్రీకాకుళం జిల్లా కిడ్నీ వ్యాగ్రస్తుల కష్టాలను చూసిన పవన్ కళ్యాణ్ చలించిపోయారు. 11 మండల్లాలోని 104 గ్రామాల్లో కనీసం 25 వేల మంది కిడ్నీ వ్యాధులకు గురయ్యారు. మరో 20 వేలమంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. కవిటి మండలం ఉద్దానం, పొందూరు మండలం భగవానుదాసుపురం, పలాస, సోంపేట, టెక్కలి, వజ్రపుకొత్తూరు, కంచిలి, మందస, ఇచ్ఛాపురం, నందిగాం, సంతబొమ్మాళి మండలాల్లో కిడ్నీ రోగులు అధికంగా ఉన్నారు. కిడ్నీ వ్యాది గ్రస్తులతో పవన్ ఇచ్చాపురంలో ముఖాముఖి మాట్లాడారు. జనసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ కిడ్నీ వ్యాది గ్రస్తులతో మాట్లాడుతూ వారి బాధలకు చలించిపోయారు.
ఉద్దానం సహా ఇతర మండలాల్లో కిడ్నీ వ్యాధులకు గురైనవారిని ప్రభుత్వం ఆదుకోవాలని, తక్షణమే ఒక కమిటీని ఏర్పాటుచేసి ఆర్థిక, ఆరోగ్య ప్యాకేజీలు ప్రకటించాలని పవన్ డిమాండ్ చేశారు. కిడ్నీ వ్యాధులపై జనసేన ఆధ్వర్యంలో ఐదుగురు డాక్టర్ల కమిటీని ఏర్పాటుచేస్తున్నామని, 15 రోజుల్లోగా ఒక రిపోర్టు తయారు చేయించి ప్రభుత్వానికి అందిస్తామని చెప్పారు. ’మేం రిపోర్టు ఇచ్చిన 15 రోజుల్లోగా ప్రభుత్వం స్పందించాలి. లేకుంటే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని చేపడతం’అని ప్రకటించారు. తక్షణ సాయంగా కిడ్నీ బాధిత కుటుంబాల్లో అనాథలైన చిన్నారుల బాధ్యతలను ప్రభుత్వాలు స్వీకరించాలని డిమాండ్ చేశారు. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై స్పందించకుంటే ప్రజా ఉద్యమాన్ని లేవదీస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.