తమిళనాడు ముఖ్యమంత్రిగా పళనిస్వామికే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు పళని స్వామికే ఉన్నందున ఆయనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. శశికళకు జైలు శిక్ష పడిన తరువాత ఆ వర్గం తమ నేతగా పళని స్వామిని ఎంపికచేసింది. దీనిపై దాదాపు 124 మంది ఎమ్మెల్యేల సంతకాలు ఉన్నట్టు సమాచారం. గవర్నర్ విద్యాసాగర్ రావును కలిసిన పళని స్వామి తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల సంఖ్యతో కూడిన జాబితాను అందచేశారు. మరో వైపు శశికళపై తిరుగుబాటు బావుటాను ఎగురవేసిన పన్నీరు సెల్వం ఎమ్మెల్యేల మద్దతును పూర్తిగా సాధించలేకపోయినట్టు కనిపిస్తోంది. అన్నా డీఎంకే కార్యకర్తలు, ఎంపీలు, నాయకులు పన్నీరుకు మద్దతు పలికినప్పటికీ అధికశాతం మంది ఎమ్మెల్యేలు మాత్రం పన్నీరుకు దూరంగా ఉండిపోయారు. వారిని ఆకట్టుకునేందుకు పన్నీరు చేసిన ప్రయత్నాలు ఫలించినట్టు కనిపించడం లేదు.
వ్యూహాత్మకంగా ఎమ్మెల్యేలను రిసార్టులకు తరలించిన శశికళ వర్గం వారిని తమ దారికి తెచ్చుకోగలిగారు. ఎమ్మెల్యేలు తిరిగుబాటు చేస్తారని భావించిన పన్నీరు సెల్వం ఆశలు నెరవేరలేదు. అయితే అన్నాడీఎంకే పార్టీ లో శశికళ అక్కకుమారుడు దినకరన్ కు కీలక బాధ్యతలు అప్పగించడంపై మాత్రం ఆపార్టీ నేతలతో పాటుగా ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నిర్ణయం పై బాహాటంగానే కొంత మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వ్యతిరేకత ఎమ్మెల్యేల మాకుమ్మడి తిరుగుబాటు వరకు వచ్చే అవకాశాలు కన్పించడంలేదు. సాధారణ ఎన్నికల సమయంలో శశికళ తన అనుచరులకు పెద్ద సంఖ్యలో టికెట్లు ఇచ్చించుకోవడం ఇప్పుడు ఆమెకు కలసివచ్చినట్టు కనిపిస్తోంది. ఎమ్మెల్యేల్లో అధికశాతం మంది ఆమె అనుచరులే కావడంతో వారు ఇప్పుడు శశికళకు బాసటగా నిలుస్తున్నారు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే పళని స్వామి వైపే కాస్త మొగ్గు కనిపిస్తున్నట్టు సమాచారం.