తమిళనాడు ముఖ్యమంత్రిగా పళని స్వామి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ఆయనతో ప్రమాణం చేయించారు. పళని స్వామితో పాటుగా 31 మంది మంత్రులు ప్రమాణం చేశారు. మంత్రులకు శాఖల కేటాయింపు కూడా జరిగిపోయింది. కీలకమైన ఆర్థిక, హోం శాఖలను పళని స్వామి తన వద్దనే ఉంచుకున్నారు. పళిని స్వామి మొదట ప్రమాణ స్వీకారం చేయాగా ఆ తరువాత మంత్రులు సామూహికంగా బృందాలుగా ప్రమాణ స్వీకారం చేశారు. పళని స్వామి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే జయలలితతో పాటుగా చిన్నమ్మకు జై కొడుతూ నినాదాలు చేశారు. తమిళనాడులో గంటకో మలుపు తిరిగిన రాజకీయ డ్రామాకు దాదాపుగా తెరపడినట్టుగానే కనిపిస్తోంది. పళని స్వామి 15 రోజుల్లోగా అసెంబ్లీలో మెజార్టీ నిరూపించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అది పెద్ద కష్టంగా కనిపించడం లేదు. అన్నా డీఎంకే శాసనసభా పక్ష నేతగా శశికళను ఎన్నుకోవడం ముఖ్యమంత్రిగా పన్నీరు సెల్వం రాజీనామా తదనంతరం పన్నీరు తరుగుబాటు సుప్రీం కోర్టు తీర్పు నేపధ్యంలో శశికళ బెంగళూరు జైలుకు వెళ్లడం వంటి పరిణామాలు చకాచకా జరిగిపోవడంతో తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారి ధ్రిల్లర్ ను తలపించాయి.
పళని స్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో అన్నాడీఎంకే కార్యకర్తలు హాజరయ్యారు. 9రోజుల పాటు క్యాంప్ లలో గడిపిన ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వాదంరినీ ప్రత్యేక బస్సుల్లో రాజ్ భవన్ కు తరలించారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా రాజ్ భవన్ బయట పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. వారిలో కొంత మంది శశికళకు అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు చేయడం కనిపించింది. జయలలిత చిత్రపటాలతో కనిపించిన అన్నాడీఎంకే నేతలు సందడి చేశారు. రాజ్ భవన్ వద్ద ప్రమాణ స్వీకారం సందర్భంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.