వేల చండీయాగాల నిర్వాహకులు పాలకుర్తి నరసింహా రామ సిద్ధాంతి మృతి

0
100
పాలకుర్తి నరసింహ రామ సిద్ధాంతి

కొన్ని వేల చండీ యాగాలను అవలీలగా నిర్వహించిన పాలకుర్తి నరసింహా రామ సిద్ధాంతి మృతిచెందారు. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలు కాశీ,ఉజ్జయినీలతో పాటుగా దేశంలోని అనేక ప్రాంతాల్లో ఆయన వేలాది చండీ యాగాలను జరిపించారు. దేశవ్యాప్తంగా 2వేలకు పైచిలుకు దేవాలయాల ప్రతిష్టలు ఆయన చేతులమీదుగా జరిగాయి. వరంగల్ జిల్లా కొడగండ్ల గ్రామానికి చెందిన పాలకుర్తి నరసింహా రామ సిద్ధాంతి అపార జ్ఞాన సంపన్నులుగా పేరుసంపాదించుకున్నారు. వేదవేదాంగాల్లో అపార ప్రావీణ్యం ఆయన సొంతం. ఎంత విద్వత్తు ఆయన సొంతమైన ఒదిగి ఉండే తత్వంతో నిరాండబరంగా జీవించిన ఆయన ఎన్నో సత్కారాలను పొందారు. రాష్ట్ర ప్రభుత్వాలతో పాటుగా సాంస్కృతిక, ధార్మిక సంస్థలు ఆయన్ను సత్కరించాయి.
స్త్రీ విద్య కోసం ఆయన విశేష కృషిచేశారు. స్త్రీలు విద్యావంతులు అయితేనే కుటుంబం యావత్తు బాగుపడుతుందనేది ఆయన ఉద్దేశం. 55 సంవత్సరాలుగా పంచాంగ రచన చేస్తున్న పాలకుర్తి నరసింహా రామ సిద్ధాంతి వైదిక, వాస్తు, సాహిత్య, జోతిష్యాలలో దిట్ట . ధర్మసందేహాలను నివృత్తి చేయడంలో ఆయనకు ఆయనే సాటి. తెలుగు రాష్ట్రాల్లో ధర్మసందేహాలు తలెత్తినపుడు వాటిపై విపులంగా చర్చించి సందేహాలను తీర్చడంలో లబ్దప్రతిష్టులు. కొడగండ్ల సిద్దాంతిగా స్థానికులు పిల్చుకునే ఆయన గత 70 సంవత్సరాలుగా స్వగ్రామంలో దేవీ నవరాత్రులను నిర్వహిస్తున్నారు. అదే గ్రామంలో యోగలింగేశ్వర సహిత రాజరాజేస్వర స్వామి దేవాలయాన్ని నిర్మించి దాని నిర్వహణహ బాధ్యతలు కూడా నిర్వహించారు.
ప్రచారాలకు దూరంగా ఉండడానికి ఇష్టపడే ఆయన అర్చక, పౌరోహిత్యాలద్వారా అనేక మందికి ఉపాధి కల్పించారు. నిత్యపారాయణం చేసే ధర్మదీక్షా తత్పరుడైన పాలకుర్తి నరసింహా రామ సిద్ధాంతి 85 సంవత్సరాలు పైబడిన తరువాత కూడా ఎంతో ఉత్సాహంగా పనిచేశారు. వాస్తు, జ్యోతిష్య శాస్త్రాలు వ్యాపారమయంగా మారాయని పలు సందర్భాల్లో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తుపేరుతో ఇంటిని సమూలంగా మార్పులు చేయడం వల్ల ఆర్థిక భారంతో అదే ఇంటిని అమ్ముకున్న దాఖలాలను ఉటంకిస్తూ శాస్త్రం పరిష్కార మార్గాలు చూపించాలే తప్ప సమూల మార్పుల పేరుతో ఇంటి యజమానులపై పెను ఆర్థిక భారలను మోపడాన్ని ఆయన తప్పుపట్టారు.
పలువురి సంతాపం.
పాలకుర్తి నరసింహా రామ సిద్ధాంతి మరణం పై పలువురు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాడ సానుభుతిని వ్యక్తం చేశారు.
పాలకుర్తి నరసింహా రామ సిద్ధాంతి మృతిపై తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘాల సమాఖ్య హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల అధ్యక్షుడు తులసీ శ్రీనివాస్ , ప్రధాన కార్యదర్శి నారాయణ కరణం సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఒక గొప్ప జ్ఞానిని తెలంగాణ రాష్ట్రం కోల్పోయిందన్నారు. రామ సిద్ధాంతి లాంటి వ్యక్తులు ధర్మ పరిరక్షణకు కంకణ బద్దులై పనిచేశారని నారాయణ కరణం పేర్కొన్నారు. వేలాది చండీయాగాలను నిర్వహించిన దక్షకుడు పాలకుర్తి సిద్ధాంతి మరణం బ్రాహ్మణ సమాజానికి తీరని లోటని తెలంగాణ బ్రాహ్మణ సేవాసంఘాల సమాఖ్య ప్రాంతీయ కార్యదర్శి వక్కలంక శ్రీనివాస్ ఓ ప్రకటనలు తెలిపారు.
palakurthi narasimha rama siddanthi, palakurthi, vsn srinivas, tulasi srinivas, tbsss.

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం


వీసా గడువు ముగిసినా అమెరికాలోనే

Wanna Share it with loved ones?