ఎన్ ' ఠీవీ'

0
89

“ప్రతీ క్షణం ప్రత్యక్ష ప్రసారం” అంటూ ఆగస్టు 30 2007లో పురుడు పోసుకున్న ఎన్టీవీ మీడియా రంగంలో తనదైన ముద్రను వేసుకుంది. ఛానల్ ప్రారంభానికి నాలుగు రోజుల ముందే లుంబినీ పార్క్, గోపుల్ ఛాట్ బండార్ వద్ద జరిగిన బాంబు పేలుళ్ళ దృశ్యాలను ఇతర మీడియా సంస్థలన్నింటికంటే ముందే ప్రసారం చేసి టెస్ట్ సిగ్నల్ లోనే సంచనాలు సృష్టించింది. 16 డీఎస్ఎన్జీలతో దేశంలోని మరే సంస్థకు లేనన్ని లైవ్ వ్యాన్ లతో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఎన్టీవీ లైవ్ ప్రసారాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. హైదరాబాద్ బాంబు పేలుడుకు సంబంధించి ఎన్టీవీ నాడు ప్రసారం చేసిన దృశ్యాలను భారత జాతీయ ఛానళ్లతో పాటుగా బీబీసీ లాంటి అంతర్జాతీయ ఛానళ్లుకూడా వాడుకున్నాయి. ప్రత్యక్ష ప్రసారాల విషయంలో ఎన్టీవీ ఒక ట్రెండ్ సెట్టర్ గా నిల్చింది. హైదరబాద్ ఫ్లైఓవర్ కూలిన ఘటన కావచ్చు, ముంబాయి బాంబు మారణహోమంకావచ్చు ప్రతీ దృశ్యాన్ని ఒడిసిపట్టుకుని ప్రేక్షకులకు ప్రత్యక్షంగా అందించిన ఎన్టీవీ ఇతర ఛానళ్లకు మార్గదర్శకంగా నిల్చింది. ప్రమాదాలు, ప్రకృతి విపత్తులు ఏవైనా సరే ఎన్టీవి అందరికంటే ముందుగానే ప్రేక్షకులకు ఖచ్చితమైన సమాచారన్ని ఇచ్చి వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వచ్చింది.
సర్వేలు:
సర్వేలు ప్రజల అభిప్రాయాలకు ప్రామాణికాలు. సర్వేలు చేయించడంలోనూ, సొంతగా సర్వేలు చేయడంలోనూ దేశంలోని ఎన్టీవీ అగ్రగణ్యురాలని చెప్పవచ్చు. ఛానల్ ఏర్పాటుకు పూర్వమే ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయ సర్వేలకు పెట్టింది పేరైన నీల్సన్-ఓఆర్జీ మార్గ్ సంస్థతో చేసుకున్న అవగాహన ప్రకారం ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తూ వచ్చిన ఎన్టీవీ ఖచ్చితత్వానికి చిరునామాగా మారింది. 2008 మొదలుకొని ఎన్టీవీ నిర్వహించిన సర్వేలు ప్రజల అభిప్రాయాలను ప్రతిబింబించాయి. ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని చెప్పడంతో పాటుగా ఎవరికి ఎంత శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందే కూడా ఖచ్చితంగా చెప్పగలిగిన ఎన్టీవీ సర్వేలు నూటికి నూరు శాతం నిజమయ్యాయి. 2009 ఎన్నికల్లో మహాకూటమిదే విజయం అంటూ ఇతర ఛానళ్లు, వార్తా సంస్థలు ఊదరగొడుతున్న సందర్భాల్లోనూ ఎన్టీవీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పిన సర్వేపై అనేక విమర్శలు వచ్చినప్పటికీ తాను చెప్పిన దానికి ఎన్టీవీ కట్టుబడి ఉంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత ఎన్టీవీ చెప్పిన విషయం నూటికి నూరు శాతం నిజమైందని అంతా ఒప్పుకోక తప్పలేదు. నామమాత్రపు శాంపిళ్లతో కాకుండా ఏకకాలంలో వేలాది మంది ప్రజలను ఎంపిక చేసుకుని వాటి ద్వారా నిర్వహించిన సర్వేలు ప్రజల నాడిని పట్టడంలో పూర్తి విజయాన్ని సాధించాయి. అయితే 2014 ఎన్నికల్లో తెలంగాణాలో ఎన్టీవీ సర్వే వాస్తవ రూపం దాల్చగా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం వ్యతిరేక ఫలితాలు వచ్చాయి. అయితే సర్వే ఫలితాలు వాస్తవ ఫలితాలకు విరుద్దంగా రావడంతో ప్రజలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పిన ఎన్టీవీ అటు తర్వాత కూడా ఈ పరంపరను కొనసాగిస్తోంది.
ప్రపంచంలోనే పేరెన్నికగన్న సంస్థలతో సర్వేలు చేయించడం ద్వారా అందులోని నైపుణ్యాన్ని ఒడిసిపట్టుకున్న ఎన్టీవీ సొంతగా ఎన్జీ మైండ్ ఫ్రేమ్స్ పేరుతో ప్రజల నాడిని పసిగట్టే సర్వేలను నిర్వహిస్తోంది. ఈ సంస్థ బీహార్ ఎన్నికల సమయంలో నిర్వహించిన సర్వే ప్రజల నాడిని పసి గట్టడంలో పూర్తిగా సఫలం అయింది. తుది ఫలితాలు సర్వే అంచానాలకు అనుగుణంగా వచ్చాయి.
రాజకీయ వార్తా విశ్లేషణలకు ఎన్టీవికి ప్రత్యేక గుర్తింపు ఉంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి జరుగుతున్న ప్రయత్నాలను, కేంద్ర నిర్ణయాలను ఇత ఛానళ్ల కన్నా ముందే చెప్పింది ఎన్టీవీ.” ఒక జాతీ రెండు రాష్ట్రాలు” పేరుతో ఎన్టీవీ ప్రసారం చేసిన కథనాలు నాడు సంచనలం రేపాయి.
సామాజిక బాధ్యత:
ఎన్టీవీ ఎన్నడూ తన సామాజిక బాధ్యతను మరవలేదు. ప్రజాహితమే లక్ష్యంగా ముందుకు సాగిన ఎన్టీవీ అనేక సామాజిక రుగ్మతలపై సమరం సాగించింది. ప్రజా సమస్యలపై గళమెత్తింది. కేవలం పట్టణాలకే పరిమితం కాకుండా ప్రతీ మారు మూల ప్రాంతం నుండి రోడ్ షోలను నిర్వహించడం ద్వారా స్థానిక సమస్యలపై ప్రజా గళాన్ని వినిపించింది. కేవలం ఎన్నికల సమయంలోనే కాకుండా అనునిత్యం ప్రజలతో మమేకం అవుతూ రోడ్ షోల ద్వారా ప్రజల అభిప్రాయాలను వారి సమస్యలను పాలకుల ముందు ఉంచింది. విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్న ర్యాగింగ్ భూతానికి వ్యతిరేకంగా కాలేజీల్లో అవగాహనా కార్యక్రమాలతో పాటుగా విశాఖపట్నంలో భారీ ర్యాలీ నిర్వహించిన ఎన్టీవీ ర్యాగింగ్ పై యుద్ధమే చేసింది.
అంధ్రప్రదేశ్ విభజనకు ముందు రాష్ట్ర వనరులను బడా కార్పోరేట్ సంస్థలు దోచుకుని పోయే ప్రయత్నాన్ని విజయవంతంగా అడ్డుకుంది. గోదావరి ప్రాంతంలోని చమురు నిక్షేపాలను రిలయన్స్ సంస్థకు గుజరాత్ కు తరలించే ప్రయత్నం చేస్తున్న సమయంలో “ఈ నేల మనది – ఈ గ్యాస్ మనది” అంటూ నినదించిన ఎన్టీవీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ షోలు నిర్వహించడంతో పాటుగా విశాఖలో ప్రజలతో భాగస్వామ్యంతో భారీ సభను ఏర్పాటు చేసి ప్రజల మనోగతాన్ని నాటి పాలకుల ముందు పెట్టింది.
పబ్బుల్లోని గబ్బును, పేకాట క్లబ్బులపై ఎన్టీవి సమర శంఖాన్ని పూరించి వాటిలో జరుగుతున్న అసాంఘీక కార్యక్రమాలను ప్రజల ముందు పెట్టింది. పబ్బుల్లో జరుగుతున్న అసాంఘీక కార్యక్రమాలను గురించి ఎన్టీవీ అప్పుడే చెప్పింది. ఈ క్రమంలో వచ్చిన ఒత్తిడులను బెదిరింపులను ఏ మాత్రం ఖాతర చేయకుండా క్లబ్బుల ముందు నుండే వాటి కార్యకలాపాలను ఎండగట్టింది. ఈ క్రమంలో ఎన్టీవీ ప్రతినిధిపై లైవ్ లోనే పేకాట క్లబ్ యజమానులు చేసిన దాడిని ప్రపంచమంతా ప్రత్యక్షంగా చూసింది.
కర్నూలు జిల్లాలో కనీవిని ఎరుగని రీతిలో వచ్చిన వరదల బాధితులకు మేమున్నాంటూ ఎన్టీవీ భరోసా ఇస్తూ వారిని అదుకుంది.
మనదేశం మన గీతం:
జాతీయ గీతాన్ని పూర్తిగా పాడలేని దుస్తితిలో భావి పౌరులు ఉన్న విషయాన్ని గుర్తించిన ఎన్టీవీ “మన దేశం-మన గీతం” పేరుతో జాతీయ గీయాలాపన కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా నిర్వహించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలోని నగరాలు, పట్టణాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన వచ్చింది. అనేక వ్యయ, ప్రయాలకు ఓర్చి ఎన్టీవీ మారుమూల ప్రాంతాల్లో సైతం “మన దేశం-మన గీతం” కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా జాతీయగీత ఔన్నత్యాన్ని చాటిచెప్పింది.వరంగల్ పట్టణంలో మొదలైన ఈ కార్యక్రమాన్ని పొరుగు రాష్ట్రాలతో పాటుగా విదేశాల్లో సైతం జరుపుకున్నారు. ఇప్పటివరకు 100 చోట్ల “మన దేశం-మన గీతం” కార్యక్రమాన్ని ఎన్టీవీ పూర్తి చేసింది. హైదరాబాద్ లో భారీ ఎత్తున నిర్వహించిన కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ తో పాటుగా ముఖ్యమంత్రి కూడా హజరై ఎన్టీవీ సాగిస్తున్న యజ్ఞానికి తమ మద్దతు తెలిపారు.
భక్తి:
తెలుగు ప్రజల ఇళ్లలో ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతున్న భక్తీ టీవీ తెలుగులో మొట్టమొదటి ఆధ్యాత్మిక ఛానల్. ఎన్టీవీతో పాటు ప్రారంభమైన ఈ ఛానల్ ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటుగా హింధూ జాతీ జౌన్నత్యాన్ని చాటుతోంది. కేవలం ఆధ్యాత్మిక ప్రసంగాలకు పరిమిత కాకుండా దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక గురువులను, పీఠాధిపతులను ఒక్క వేదికపైకి తీసుకుని వచ్చి ధార్మిక సమ్మెళనాన్ని ఘనంగా నిర్వహించిన ఘనత భక్తీ టీవీదే… తిరుమల పవిత్రతతను కాపాడే ఉద్దేశంతో “తిరుమల మనదే” అంటూ నినదించింది భక్తీ టీవి.
దీపోత్సవం:
దీపం అంటేనే భక్తీ టీవీ ఆధ్వర్యంలో నిర్వహించే దోపోత్సవంగా తెలుగువారి మనసుల్లో ముద్ర వేసుకున్న కోటి దీపోత్సవం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే…కార్తీక మాసంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. లక్ష దీపోత్సవంగా ప్రారంభమై ఇప్పుడు శత కోటి కాంతులను విరజిమ్ముతున్న కోటి దీపోత్సవం ఒక ఆధ్యాత్మిక యజ్ఞం. కోటిదీపోత్సవం కోట్లాది దీపకాంతులతో ఇల కైలాసంగా విరాజిల్లుతుంది. ఆధ్యాత్మిక వేత్తల, పిఠాధి పతుల ప్రసంగాలతో ప్రముఖ దేశాలయాల నుండి భక్తులకోసం విచ్చేసిన దేవతా మూర్తుల సమక్షంలో వెలిగించిన దీప కాంతులను చూడడానికి రెండు కళ్లూ చాలవు. ఇంతటి అద్భుత కార్యక్రమాన్ని నిర్వహించడం కేవలం భక్తీ టీవీకే సాధ్యం అన్నది ఏ మాత్రం అతిశయోక్తి కాదు.
ఈ ఆధ్యత్మిక మహా క్రతువులోని ప్రతీ దృశ్యాన్ని ప్రేక్షకుల మదిలో నింపేందుకు దేశంలోనే అంటుబాటిలో ఉన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా దీప మహా యజ్ఞాన్ని ప్రపంచానికి చూపుతోంది భక్తీ టీవీ.
10 సంవత్సరాల్లో ఎన్నో మైలు రాళ్లను దాటుకుండూ ముందుకు వెళ్తున్న ఎన్టీవీ మరిన్ని మైలు రాళ్లను దాటాలని కోరుకుందాం….
(ఎన్టీవీ 10వ వార్షికోత్సవం సందర్భంగా)
B.V.L.K.MANOHAR

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here