క్షిపణి ప్రయోగాలు చేస్తాం మళ్లీ మళ్లీ అంటున్న ఉ.కొరియా

0
70

ఉత్తర కొరియా తాజాగా జరిగిన క్షిపణి ప్రయోగం పై అగ్రరాజ్యం అమెరికాతో సహా దక్షిణ కొరియా, జపాన్ లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండగానే వారిని మరింత రెచ్చగొట్టే వ్యాఖ్యలకు దిగుతున్నారు ఆ దేశ అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ వున్‌. క్షిపణి ప్రయోగాన్ని సమర్థించుకోవడం తో పాటుగా రానున్న రోజుల్లో మరిన్ని ప్రయోగాలు చేస్తామంటూ చేసిన వ్యాఖ్యలు మరింత రెచ్చగొట్టేవిగా ఉన్నాయి. ఉత్తర కొరియా ప్రయోగించిన క్షిపణి జపాన్ మీదుగా దూసుకుని పోవడంతో జపాన్ తీవ్రంగా కలవర పడుతోంది. దీనికి తోడు మరిన్ని క్షిపణులను జపాన్ మీదుగా ప్రయోగిస్తాం అంటూ ఉత్తర కొరియా అధినేత చేసిన వ్యాఖ్యలు జపాన్ ను మరింత కలవరానికి గురిచేయక మానవు.
అమెరికాతో సహా పొరుగు దేశాలతో కయ్యానికి కాలు దువ్వుతున్న ఉత్తర కొరియాను ఎట్లా నిలువరించాలో తెలియక ప్రపంచ దేశాలు తలలు పట్టుకుని కూర్చుంటున్నాయి. ఐక్య రాజ్యసమితి మాటలను పట్టించుకోని ఉత్తర కొరియా అమెరికా హెచ్చరికలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఆర్థిక ఆంక్షలు విధించినా కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేసినా అవేవీ ఉత్తర కొరియా చెవికి ఎక్కడం లేదు. అన్ని విషయాల్లో ఉ.కొరియాకు వెన్నుదన్నుగా నిలుస్తున్న చైనా కూడా ఉత్తర కొరియాను పూర్తిగా దారిలోకి తీసుకుని రాలేక పోతోంది. మరో వంక ఉత్తర కొరియా ను వెనకేసుకుని వస్తోంది. జపాన్, దక్షిణ కొరియాలతో పాటుగా అగ్ర రాజ్యం అమెరికాకు కూడా ఇప్పుడు ఉత్తర కొరియా కొరకరాని కొయ్యగా తయారైంది.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here