నీరవ్ మోడీ స్కాంలో అసలు దోషులు?

పంజాబ్ నేషనల్ బ్యాంకును బురిడి కొట్టించి వేల కోట్ల రూపాయల దండుకున్న నీరవ్ మోడి వ్యవహారం ఇప్పుడు రాజకీయ రంగు పులుపుకుంది. మొదట అంచానా వేసినట్టుగా నీరవ్ బ్యాంకులను మోసగించింది 11400 కోట్లు కాదని దానికన్నా మరో 6200 కోట్లు అదనంగా ఉంటుందని ఐటి శాఖ భావిస్తోంది. దీనితో నీరవ్ మోడీ బ్యాంకుల వద్ద నుండి కొల్లగొట్టిన మొత్తంగా 17600 కోట్లకు చేరుకుంది. ఇంత పెద్ద మొత్తంలో ఒక వ్యక్తి ప్రజాధనాన్ని అప్పనంగా కాజేసి విదేశాలకు చెక్కేయగా ఇప్పుడు తాపీగా రాజకీయ పార్టీలు తప్పు మీదంటే మీదని నెపాన్ని ఒకరిపై ఒకపు మోపుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఈ కుంభకోణానికి బీజం పడిందని కాంగ్రెస్ పార్టీ పెద్దలతో నీరవ్ మోడితో పాటుగా అతనికి సన్నిహితులకు సంబంధాలు ఉన్నాయంటూ బీజేపీ ఆరోపిస్తోంది. మరో వైపు బీజేపీ అగ్ర నాయకత్వం కనుసన్నల్లోనే ఈ వ్యవహారం నడిచిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు గుప్పిస్తోంది.
బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టిన పెద్ద మనుషులు దేశం వదిలి పోయిన తరువాత ఆ మంటల్లో చలికాచుకునేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అధికార, విపక్షాలు ఈ వ్యవహారం ద్వారా రాజకీయ లబ్దిని పొందడానికి చేస్తున్న ప్రయత్నాలు దారుణంగా ఉన్నాయి. ఒకటికాదు రెండు కాదు వేల కోట్ల రూపాయలు దండుకుని విదేశాల్లో పెద్ద మనుషులు జల్సా చేస్తుంటే కళ్లప్పగించి చూడడం మినహా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలోకి దర్యాప్తు సంస్థలు చేరకున్నాయి. విదేశీ చట్టాలను తమకు అనుకూలంగా మార్చుకుని దేశ ప్రజల సొమ్ముతో ఆర్థిక నేరగాళ్లు విదేశాల్లో కులుకుతున్నారు.
ఆర్థిక నేరాల విషయంలో అన్ని రాజకీయ పక్షాలకు చిత్తశుద్ది కొరవడిందనేది నిర్వివాదాశం. ప్రభుత్వ రంగ బ్యాంకుల నెత్తిన నిరర్థక ఆస్తులు మోయలేని భారంగా మారుతున్నాయి. దాదాపు లక్షా 20 వేల కోట్ల రూపాయల వరకు వసూలు కాని అప్పులు ఉన్నట్టు ఒక అంచానా. బ్యాంకులకు సంబంధించిన వసూలు అప్పుల విషయంలో స్పష్టమైన అంకెలు బయటికి రావడం లేదు. రకరకాల కారణాలతో ఆ వివరాలను గోప్యంగా ఉంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేశంలోని బడా పారిశ్రామిక వేత్తలతో దాదాపు అన్ని రాజకీయ పక్షాలకు పత్యక్ష పరోక్ష సంబంధాలు ఉన్నాయనే విషయం బహిరంగ రహస్యమే. పెద్ద మొత్తంలో పార్టీ ఫండ్ ను వసూలు చేసుకుంటూ వారికి కావాల్సిన అన్ని రకాల అండదండలు ఇస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
పార్టీల దన్ను. ప్రభుత్వంలోని పెద్దల సహకారంతో కొంతమంది పారిశ్రామిక వేత్తలు బరితెగిస్తున్నారు. బ్యాంకుల నుండి అప్పులు తీసుకుని వాటిని చెల్లించకుండా ఎగవేస్తున్నారు. అయినా వారిపై చర్యలు తీసుకునే దమ్ము, ధైర్యం ఇటు బ్యాంకులకు, అటు దర్యాప్తు సంస్థతలకు కరువవుతోంది. సామాన్యులకు రుణాలు ఇవ్వాడానికి సవాలక్ష ప్రశ్నలు వేసి విసిగించే బ్యాంకులు అడ్డగోలుగా కోట్లాది రూపాయల అప్పులు ఎట్లా ఇస్తున్నాయనేది సమాన్యుడికి అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. రాజకీయ పక్షలు పరస్పరం నిందలు వేసుకోవడం మాని చిత్తశుద్దితో పనిచేస్తేనే ఆర్థిక నేరగాళ్ల ఆటకట్టించడం సాధ్యమవుతుంది.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *