చిలకానగర్ లో బలైన చిన్నారి ఎవరు?

చిలుకానగర్ నరబలి కేసులో మృతి చెందిన చిన్నారి ఎవరనే విషయం ఇంతవరకు తేలలేదు. తన ఆరోగ్యంతో పాటుగా ఆర్థిక సమస్యల నుండి గట్టెక్కడానికి రాజశేఖర్ అనే క్యాబ్ డ్రైవర్ ఆరు నెలల చిన్నారిని చంద్రగ్రహణం రోజున బలి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ చిన్నారిని బోయిగూడ ప్రాంతం నుండి అపహరించినట్టుగా రాజశేఖర్ చెప్తున్నాడు. అయితే ఆ చిన్నారి తల్లిదండ్రులు ఎవరు అనేది ఇంతవరకు మిస్టరీగా మారింది. స్థానికంగా పేవ్ మెంట్ మీద పుడుకున్న ఉన్న దంపతుల వద్ద నుండి చిన్నారని తీసుకుని వచ్చినట్టు నిందితుడు రాజశేఖర్ చెప్తున్నాడు. అయితే అది ఎంతవరకు వాస్తవం అన్నది తేలాల్సి ఉంది చిన్నారికి సంబంధించిన ఎటువంటి ఆనవాళ్లు పోలీసులకు చిక్కలేదు. చిన్నారి తలను స్వాదీనం చేసుకున్న పోలీసులకు మొండెం లభించలేదు. ప్రతాప సింగారం వద్ద మూసీలో మొండాన్ని పాడేసినట్టు నిందితుడు చెప్తున్నాడు. మొండాన్ని కనుగొనేందుకు పోలీసులు విశ్వప్రయత్నం చేసినా ఫలితం కనిపించడం లేదు.
చిన్నారి తల్లిదండ్రులు ఎందుకు పోలీసులను ఆశ్రయించలేదు అనే విషయం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. నిజంగానే చిన్నారిని ఎత్తుకుని వచ్చాడా లేక ఎవరిదగ్గర నుండైనా కొనుగోలు చేశాడా అనే విషయం కూడా తేలాల్సి ఉంది. పెంచుకుంటామంటూ తీసుకుని వచ్చి నరబలి ఇచ్చాడా అనేది కూడా తేలాలి. కేసులకు భయపడి చిన్నారి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించలేదా లేదా చిన్నారిని వారు మరేదైనా ప్రాంతం నుండి అపరించి తీసుకుని వచ్చారా అనేది కూడా తేలాల్సి ఉంది.
నరబలి కేసు విషయంలో అనేక చిక్కుముడులు ఇంకా విప్పాల్సి ఉంది. చిన్నారికి సంబంధించిన ఆచూకీతో పాటుగా నిందితుడు ఇచ్చిన వాంగ్మూలం తప్పిస్తే రాజశేఖర్ నరబలి ఇచ్చాడనాడాని కావాల్సిన బలమైన ఆధారాలు పోలీసులకు చిక్కాల్సి ఉంది. నిందితుడు చాలా తెలివిగా వ్యవహరించాడని పోలీసులు చెప్తున్నారు. ముందు పోలీసులనే తప్పదోవ పట్టించిన రాజశేఖర్ ఇతరులపైకి అనుమానం వచ్చేలా ప్రవర్తించడంతో పాటుగా చాలా అమాయకుడిగా నటించడంతో పోలీసులే ఖంగుతినాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ కేసును చేధించేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అత్యంత క్లిష్టంగా మారిని కేసులో కీలక పురోగతిని సాధించి నిందితుడుని పట్టుకున్న పోలీసులు మిగిలిన చిక్కుముడులు విప్పేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు.