బంధనాలు తెంచుకున్న ముస్లీం మహిళ

ముడు సార్ల తలాక్ చెప్పడం ద్వారా విడాకులు ఇచ్చే సంస్కృతి ఇకపై చెల్లదంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. దేశం యావత్తు ఈ తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తోంది. భారత రాజ్యాంగం ప్రకారం ఉన్న సమానత్వ హక్కును హరించే విధంగా ఉన్న ట్రిపుల్ తలాక్ వ్యహారంలో సుప్రీం కోర్టు చారిత్రక తీర్పును వెలువరించిన నేపధ్యంలో దీనిపై యావత్ దేశం హర్షం వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా ఇటువంటి పద్దతి వల్ల దారుణంగా నష్టపోయిన ముస్లీం మహిళలు బంధానాలకు తెంచుకున్నట్టుగా భావిస్తున్నారు. తలాప్ చెప్పడం ద్వారా విడాకులు ఇస్తూ ఇష్టం వచ్చినట్టు వ్యవహరించే మగ పుంగవులకు ఈ తీర్పు గట్టి ఎదురుదెబ్బే. దశాబ్దాలుగా కొనసాగుతున్న అనాచారంపై కొంత మంది పూరించిన సమర శంఖం వల్ల ఇప్పుడు ఈ దారుణానికి చరమగీతం పాడినట్టయింది.
సుప్రీం కోర్టు తీర్పు చెప్పిన తరువాత కూడా కొంత మంది తీర్పును తప్పుబట్టడం. ముస్లీంల షరియత్ కు అనుగుణంగా తీర్పు లేదంటూ వ్యాఖ్యలు చేయడాన్ని బట్టి చూస్తుంటే వారి మనస్తత్వం ఏమిటో స్పష్టం గా తెలుస్తోంది. దురాచారం ఏ మతంలో ఉన్నా అది ఆచరణనీయం కాదు. ఆచారాల పేరుతో జరుగుతున్న దారుణాలను అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మహిళల హక్కులను కాలరాస్తు వారిని ప్రతి నిత్యం వేధింపులకు గురిచేసే త్రిపుల్ తలాక్ బంధనాల నుండి ముస్లీం మహిళలు బయటకు రావడం సంతోషకర పరిణామం.