మంచి భవిష్యత్ కోసం కొన్నిరోజులపాటు కష్టాలు పడేందుకు దేశ ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని అయితే కొంత మంది మాత్రం లేనిపోని రాద్దాంతం చేస్తున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోడి అన్నారు. ముంబాయిలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మోడీ అక్కడ జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. రాబోయే మంచి రోజుల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. పెద్ద నోట్ల రద్దు లాంటి కఠిన నిర్ణయాన్ని తమ ప్రభుత్వం తీసుకుందని దీనివల్ల కొద్దిరోజుల పాటు కష్టాలు తప్పవని ఇదే విషయాన్ని తాను మొదటి నుండి చెప్తునే ఉన్నానని అన్నారు. కొద్దిరోజుల పాటు కష్టపడితే ఇక వచ్చేవన్నీ మంచిరోజులేనన్నారు. నిజాయితీపరులు, పేదలకు మంచి జరుగుతుందని అవినీతి పరుల గుండెల్లో మాత్రం రైళ్లు పరుగెడతాయన్నారు. అవినీతి పరుల ముందు దేశం ఎన్నడూ తలవంచలేదని ఇక ముందు కూడా తలవంచబోదని మోడీ అన్నారు.
ప్రజా సమస్యలను తీర్చడంలో, వాటిని అర్థం చేసుకుని పరిష్కార మార్గాలు చూపడంలో చత్రపతి శివాజి రాజకీయనాయకులందరికీ స్పూర్తినిస్తుందన్నారు. శివాజీ ఆ కాలంలోనే పర్యాటక రంగాన్ని ప్రోత్సహించారని చెప్పారు.