ఇది మోడీ విజయం…

గుజరాత్ లో మోడీ నెగ్గాడు. తన పంతం నెగ్గించుకున్నాడు. రాష్ట్రంలో వీస్తున్న ఎదురుగాలులను సైతం తనకు అనుకూలంగా మార్చుకున్న మోడీ, అమిత్ షాలు గుజరాత్ లో పార్టీని విజయతీరాలకు చేర్చారు. ఐదు పర్యాయాలుగా బీజేపీ గుజరాత్ లో అధికారంలో ఉంది. దీనితో సహజంగానే ఆపార్టీ మీద ప్రభుత్వ వ్యతిరేకత గట్టిగానే ఉంది. దీనికి తోడు ముఖ్యమంత్రి మార్పు, పార్టీలో అంతర్గత విభేదాలు పార్టీకి తలనొప్పిగా మారాయి. గుజరాత్ లో బలమైన పాటేదార్ల సామాజిక వర్గం బీజేపి దూరం అయింది. ఈ సామాజిక వర్గం నేత హార్థిక్ పటేల్ అధికార పక్షానికి కంటిమీద కునుకు లేకుండా చేశాడు. వీరికి తోడు బీసీ, మైనార్టీ,దళిత నాయకులులు కాంగ్రెస్ మద్దతు పలకడంతో బీజేపీ పరిస్థితి మరింత దారుణంగా తయారయింది. ప్రధాని మోడీ స్వరాష్టంలో బీజేపీకి ఎదురు గాలి తప్పదనే పరిస్థితి నెకొంది. ఈ సమయంలో మోడి, అమిత్ షాలు వ్యూహాలకు పదును పెట్టారు. మోడీ వాగ్ధాటికి అమిత్ షా వ్యాహాలు తోడు కావడంతో గుజరాత్ లో పార్టీ విజయ తీరాలకు చేరింది.
స్వయంగా తన సొంత రాష్ట్రంలో పార్టీ ఓటమి ఎదుర్కొంటే దాని ప్రభావనం రానున్న రోజుల్లో దేశం మొత్తం ఉంటాయని మోడికి ఖచ్చితంగా తెలుసు.దీని కోసం గాను గుజరాత్ పైనే పూర్తిగా దృష్టిసారించిన మోడి పార్టీని గట్టెక్కించడానికి అన్ని మార్గాలను వాడుకున్నారు. గుజరాత్ తో పాటుగా ఎన్నికలు జరుగుతున్న హిమాచల్ లో పెద్దగా పర్యటించని ప్రధాని పూర్తిగా గుజరాత్ లో మకాంవేసి గెలుపు కోసం సర్వశక్తులు ధారపోశాడు. అంది వచ్చిన అవకాశాలను వాడుకుంటూ ప్రత్యర్థి పార్టీని దెబ్బతీశాడు. నీచ్ ఆద్మీగా కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యను గుజరాత్ ఆత్మగౌరవానికి ముడిపెడుతూ మోడీ చేసిన ప్రచారం చెప్పుకోదగ్గ ఫలితాన్నే ఇచ్చింది. మణిశంకర్ అయ్యర్ ను పార్టీ నుండి సస్పెండ్ చేసినా కాంగ్రెస్ కు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పాకిస్థాన్ కు మణిశంకర్ అయ్యర్ తన హత్యకు సుపారి ఇచ్చాడంచూ మోడి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి.
గుజరాత్ లో బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ నేతలు పాకిస్థాన్ తో కలిసి కుట్రలు పన్నుతున్నారంటూ ప్రధాని చేసిన వ్యాఖ్యలు కూడా ఆ పార్టీ విజయానికి దోహదపడ్డాయి. వ్యాపార వర్గాలైన గుజరాతీయులను జీఎస్టీ గట్టి దెబ్బే కొట్టినప్పటికీ బీజేపీ తన ఆఖరి ఆస్త్రం హిందుత్వ అంశాన్ని తెరపైకి తీసుకుని రావడంతో ఇతర విషయాలు మరుగున పడ్డాయి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సహా కాంగ్రెస్ నేతలు పాకిస్థాన్ నేతలతో సమావేశమయ్యారంటూ మోడీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఎన్నికల్లో విజయం కోసం ప్రధాని స్థాయిచో వ్యక్తి చేసిన ఆరోపణలు ప్రకంపనలు రేపాయి. విమర్శకుల మాట ఎట్లా ఉన్నా ఈ వ్యాఖ్యలు సామాన్య ఓటర్లకు తగలాల్సిన చోట తగిలాయి. బీజేపీ గెలుపు ఖాయం అయిపోయింది.
అయితే బీజేపీకి అన్నీ ఆశించినట్టేమి జరగలేదు. 150 సీట్ల మార్క్ ను దాటుతామని చెప్పిన పార్టీ అతి కష్టం మీద 100 సీట్ల మార్క్ ను చేరుకోగలిగింది. చాలా చోట్ల స్వల్ప మెజార్టీతో బీజేపీ అభ్యర్థులు గట్టెక్కారు. కాంగ్రెస్ ఈ దఫా బీజేపీకి గట్టి పోటీనే ఇచ్చింది. గత ఎన్నికల కంటే దాదాపు 20 స్థానాలు ఎక్కువగా తన ఖాతాలో వేసుకుంది. చాలా జిల్లాల్లో బీజేపీ ఖాతా కూడా తెరవలేకపోయింది. సౌరాష్ట్రా ప్రాంతంలో పటెళ్లు బీజేపీకి తమ దెబ్బచూపించారు. రానున్న రోజుల్లో బీజేపీకి కష్టాలు తప్పేలా లేవు.Leave a Reply

Your email address will not be published. Required fields are marked *