నవంబర్ ఆఖరులో మెట్రో పరుగులు

హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశను నవంబర్ ఆఖరులో ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మెట్రో రైలుకు పచ్చ జెండా ఊపాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోడీని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. ఈ మేరకు ప్రధానికి కేసీఆర్ ఒక లేఖను రాశారు. ప్రధాని నుండి ఆమోదం లభించిన తరువాత దీనిపై ఒక అధికారిక ప్రకటన చేయనున్నారు. నవంబర్ 28 నుండి 30వ తేదీ వరకు హైదరాబాద్ లో జరిగే ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. అదే సమయంలో మెట్రో మొదటి దశను ప్రారంభించాల్సిందిగా మోడీకి కేసీఆర్ ఒక లేఖను రాశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న హైదరాబాద్ మెట్రో రైలు మొత్తం 72 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్నారు. ఇందులో మొదటి దశగా మియాపూర్ నుండి అమీర్ పేట, నాగోల్ నుండి అమీర్ పేట వరకు మొత్తం 30 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. రైల్వే స్టేషన్ల నిర్మాణంతో పాటుగా ఇప్పటికే పలు దఫాలుగా మెట్రో అధికారులు ట్రైల్ రన్ ను నిర్వహించారు. దీనితో ఈ మొదటి దశను నవంబర్ లో ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
మెట్రో పనులను ప్రారంభించాల్సిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి ప్రధాని నరేంద్ర మోడీకి రాసిన లేఖ ప్రతిని రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో ఉంచారు. 15 వేల కోట్ల రూపాయల వ్యయంతో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో నిర్మిస్తున్న ప్రాజెక్టుగా మెట్రో రైలును ఈ లేఖలో ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మొదటి దశ పనుల ప్రారంభం దగ్గర పడుతుండడంతో మిగిలన పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *