మెట్రోలో మావాటా సంగతేంటి అంటున్న కాంగ్రెస్…

0
80

మెట్రో రైలు ప్రాజెక్టు పట్టాలెక్కింది. నగర ప్రజల ట్రాఫిక్ కష్టాలు గట్టెక్కించే ఈ భారీ ప్రాజెక్టు ఫలాలు ఎవరికి దక్కాలి… తమ హయాంలో ప్రాజెక్టును మొదలు పెట్టారు కనుక ఈ క్రెడిట్ అంతా తమకే దక్కాలనేది కాంగ్రెస్ పార్టీ వాదన. తమ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి హయాంలో మెట్రో ప్రాజెక్టు మొదలైందని ఆ తరువాత వచ్చిన ముఖ్యమంత్రులు కూడా మెట్రో రైలు కోసం నిత్యం కృషిచేశారని కాంగ్రెస్ పార్టీ అంటోంది. ఈ ప్రాజెక్టు విజయంలో తమ పార్టీకి కూడా ఖచ్చితంగా క్రెడిట్ దక్కాల్సిందేనని అంటోంది. అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ తమ పార్టీనే అధికారంలో ఉన్న సమయంలో ఈ ప్రాజెక్టు మొదలైందని మెట్రో క్రెడిట్ తమదేనని ఆ పార్టీ నేతలంటున్నారు.
మెట్రో ప్రాజెక్టును ప్రారంభించే ఛాన్స్ అటు కేంద్రంలో బీజేపీ ఇటు రాష్ట్రంలో టీఆర్ఎస్ లు కొట్టేశాయి. కాంగ్రెస్ హయాంలో ప్రారంభమయినప్పటికీ ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభమైన మెట్రో రైలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పూర్తయ్యింది. అధికార పార్టీ టీఆర్ఎస్ మెట్రో క్రెడిట్ పూర్తిగా తమ ఖతాలో వేసుకోకుండా విపక్షం శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ దీన్ని ఎవరూ పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించడం లేదు.
కాంగ్రెస్ పార్టీ మరో అడుగు ముందుకేసీ మొదట్లో కేసీఆర్ మెట్రో రైల్ ప్రాజెక్టును వ్యతిరేకించారని ఇప్పుడు మాత్రం ఎల్ అండ్ టి సంస్థ పెట్టిన షరతులను అన్నింటిని ఒప్పుకుంటున్నారనే ప్రచారాన్ని చేస్తోంది. కేసీఆర్ గతంలో చేసిన ప్రసంగాలను ఉదహరిస్తూ నాడు మెట్రో రైల్ ను వ్యతిరేకించిన కేసీఆర్ ఇప్పుడు ఎందుకు దానికి వత్తాసు పలుకున్నారనే విపక్షాల ప్రశ్న. దీనికి తోడు మెట్రో రైలు ఛార్జీలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయంటూ విపక్షాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. కనీసం తమ పార్టీని మెట్రో రైలు ప్రారంభోత్సవానికి ఆహ్వానించకపోవడంపై కాంగ్రెస్ పార్టీ గుర్రుగా ఉంది.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here